miss asia 2017: మిస్ ఆసియా-2017గా ఇండియన్ బ్యూటీ చెరిల్!
- మూడో అతిపెద్ద అందాల పోటీలో సత్తా చాటిన ముంబై యువతి
- 49 మందిని వెనక్కు నెట్టి కిరీటాన్ని ఎగరేసుకుపోయిన చెరిల్
- వ్యాపారరంగంలోనూ సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ
- త్వరలో వెండితెరపై మెరవనున్న చెరిల్ చార్లెస్
ప్రపంచంలో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ తరువాత మూడో అతిపెద్ద బ్యూటీ కాంటెస్ట్ గా పేరు పడ్డ మిస్ ఆసియా ఈ సంవత్సరం అందాల సుందరిగా ఇండియన్, ముంబైకి చెందిన అందాలరాశి చెరిల్ చార్లెస్ ఎన్నికైంది. లెబనాన్ లోని బీరూట్ లో జరిగిన పోటీల్లో ఇండియా తరపున పోటీ పడ్డ చెరిల్, వివిధ దేశాల నుంచి వచ్చిన 49 మంది పోటీదారులను వెనక్కు నెట్టి, కిరీటాన్ని సొంతం చేసుకుంది.
ఈ పోటీల్లో 'మిస్ బ్యూటిఫుల్ స్కిన్', 'మిస్ కాంజీనియాలిటి', 'బెస్ట్ వాక్', 'మిస్ ఇంటలెక్చువల్' టైటిళ్లు కూడా ఆమె ఖాతాలో చేరిపోయాయి. ఇండియాలో ఓ వైపు మోడల్ గా రాణిస్తూ, 'ఎన్ లైట్ ఇండియా' అనే బ్యూటీ, ఫ్యాషన్ మేగజైన్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ గానూ చెరిల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇండియాలో జరిగిన మెగా మోడల్ ఫేస్ హంట్, మిస్ ఇండియా దివా వంటి పోటీల్లో విజయం సాధించిన ఆమె, ఆపై మిస్ ఇండియా పోటీల్లో మూడో స్థానంలో నిలిచి, మిస్ ఆసియా పోటీలకు ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించింది.
కేవలం ఫ్యాషన్ రంగంలోనే కాకుండా, ఔత్సాహిక వ్యాపారస్తురాలిగా, రచయితగా, సెలబ్రిటీలకు వార్డ్ రోబ్ కన్సల్టెంట్ గానూ చెరిల్ పని చేస్తున్నారు. ఆమె రాసిన పోయమ్స్ ప్రచురణకు సిద్ధంగా ఉండగా, స్టార్ లైన్ ప్రొడక్షన్స్ సంస్థ దర్శకుడు జూడ్ లాజరస్ ఫెర్నాండెజ్ తో కలసి తీయనున్న చిత్రంలో చెరిల్ హీరోయిన్ గా చాన్స్ కొట్టేశారు.