north korea: అత్యంత రహస్యంగా ఉత్తర కొరియా అణుజలాంతర్గామి నిర్మాణం.. సహకరిస్తున్న రెండు దేశాలు!
- శక్తిమంతమైన సబ్ మెరైన్ నిర్మాణం
- సహకరిస్తున్న చైనా, రష్యా
- 2020 నాటికి నిర్మాణం పూర్తి
యుద్ధకాంక్షతో రగిలిపోతున్న ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్... అత్యంత రహస్యంగా మరో కార్యక్రమాన్ని చేపట్టారు. అణుజలాంతర్గామిని అత్యంత రహస్యంగా ఉత్తర కొరియా రూపొందిస్తోంది. దీని నిర్మాణం కోసం చైనా, రష్యాలకు చెందిన అత్యున్నత స్థాయి ఇంజినీర్లు పని చేస్తున్నారు. ఈ విషయాన్ని జపాన్ మీడియా వెల్లడించింది. ఉత్తర కొరియాలోని నాంపో నావెల్ షిప్ యార్డులో దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొంది. 2020 నాటికి జలాంతర్గామి నిర్మాణం పూర్తవుతుందని తెలిపింది.
అణుజలాంతర్గామిని నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని... అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని... అయితే ఉత్తర కొరియా మాత్రం దాన్ని చాలా సునాయాసంగా తయారు చేయగలుగుతోందని జపాన్ మీడియా పేర్కొంది. చమురు అవసరం లేకుండానే ఎక్కువ కాలం నీటిలోనే ఉండేలా, దీన్ని రూపొందిస్తున్నారని చెప్పింది. ఇది అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామి అని తెలిపింది.