swami paripoornananda: హిందుత్వం జోలికి రాకూడదు: ప్రొ.కంచ ఐలయ్యపై స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం
- కంచ ఐలయ్య మతం మారాడు
- వైశ్యులు తమ వ్యాపారాలను న్యాయంగా చేస్తారు
- జాకీర్ నాయక్ పై నిఘా పెట్టినట్లు ఐలయ్యపై కూడా పెట్టి విచారణ జరపాలి
‘సామాజిక స్మగ్లర్లు కొమటోళ్లు’ అంటూ ప్రొ.కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై తాజాగా శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్పందించారు. ఐలయ్య ఇటువంటి పుస్తకాలు రాయడం తప్పని ఆయన హితవు పలికారు. కంచ ఐలయ్య మతం మారాడని, అందుకే ఆయనకు మతిపోయిందని విమర్శించారు. భారత్‌లోకి చొరబడి దోచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ, బహుళ జాతి కంపెనీలపై ఏనాడూ నోరు విప్పని ఐలయ్య వైశ్యులపై ఇటువంటి పుస్తకాలు రాయడమేంటని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు.
వైశ్యులు తమ వ్యాపారాలను న్యాయంగా చేస్తారని అన్నారు. అంతేగాక, వైశ్యులు సంపాదించిన దాంట్లో పది శాతం సమాజం కోసం ఖర్చు చేస్తారని, అటువంటి వారిని ఐలయ్య స్మగ్లర్లు అని అంటాడా? అని ఆయన ప్రశ్నించారు. ఐలయ్య హిందుత్వం జోలికి రాకూడదని పరిపూర్ణానంద హెచ్చరించారు. ఉగ్రవాదులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జాకీర్ నాయక్ పై ఎలా నిఘా పెట్టారో ఐలయ్యపై కూడా అలాగే నిఘా పెట్టి విచారణ జరిపించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.