vijayawada: స్వర్ణ కాంతుల ధగధగలతో మెరిసిపోతున్న దుర్గమ్మ!
- నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
- తొలి రోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి
- అమ్మ దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైంది. నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమై, 30 వరకూ సాగనున్నాయి. నేడు అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులను కరుణించనున్నారు. పూర్తి స్వర్ణాభరణాల కాంతుల మధ్య దుర్గమ్మ ధగధగలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని, ఈ-సేవ, ఇంటర్నెట్ ద్వారా దర్శన స్లాట్లను పొందిన వారికి త్వరగా దర్శనం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలుగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. కృష్ణా ఘాట్ నుంచి భక్తులను పైకి అనుమతిస్తామని, వేరే మార్గంలో కిందకు వెళ్లాల్సి వుంటుందని స్పష్టం చేశారు. కొండపై వన్ వేను అమలు చేస్తున్నామని, ఎటువంటి వాహనాలనూ అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. కాగా, దసరా ఉత్సవాల తొలిరోజున అమ్మవారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు మంచినీరు తదితర సేవలందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.