Arvind Kejriwal: నేడు కమలహాసన్‌తో భేటీ కానున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తమిళనాట హాట్ టాపిక్
- ఆమ్ ఆద్మీతో చేతులు కలపనున్న కమల్?
- దక్షిణాదిన బలం పెంచుకోవాలని చూస్తున్న ఢిల్లీ సీఎం
- ఇరువురి కలయికపై బోలెడన్ని ఊహాగానాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తమిళ సూపర్ స్టార్ కమల హాసన్‌ను కలవబోతుండడం హాట్ టాపిక్‌గా మారింది. మహారాష్ట్రలోని ఇగట్‌పురిలో 9 రోజుల మెడిటేషన్ అనంతరం కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఆయన చెన్నై వెళ్లి కమల హాసన్‌ను కలవనున్నారు.
రాజకీయాల్లోకి రానున్నట్టు కమల్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో వీరిరువురి కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. కేజ్రీవాల్‌ను కమల హాసనే కలవాలని భావించినట్టు తెలుస్తోంది. లంచ్ సందర్భంగా పలు విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
కమల్ కొత్త పార్టీ కనుక పెడితే ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ముందుకు వెళ్లే ఆలోచనతో ఉన్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి భేటీలో ఇదే విషయం చర్చకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ఇదే నెల మొదట్లో కమల్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కూడా కలిశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఆవల కూడా బలపడాలని భావిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలోనూ తన ప్రస్థానాన్ని ప్రారంభించాలని ఉబలాటపడుతోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గోవా, పంజాబ్‌లోనూ పోటీ చేసింది. రెండింటిలోనూ ఓడిపోయినా పంజాబ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇప్పుడు దక్షిణాదిన కమల్‌ను కలుపుకుపోవడం ద్వారా బలీయమైన శక్తిగా ఎదగాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.