trump: అలా మాట్లాడి ఏం సాధించారు? ట్రంప్ ను ఎద్దేవా చేసిన చైనా
- 'పీపుల్స్ డైలీ'లో ప్రత్యేక కథనం
- భయపెడితే మరిన్ని క్షిపణి పరీక్షలు
- ఉద్రిక్తతలు పెంచడం తప్ప ఏం సాధించారు?
- ట్రంప్ ను ప్రశ్నించిన చైనా
ఉత్తర కొరియాను సమూలంగా తుడిచేస్తామని ఐరాస సభ్య దేశాలను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంతో ఏ మాత్రం ఉపయోగం ఉండబోదని చైనా అభిప్రాయపడింది. శాంతిని కాంక్షించేలా కాకుండా మరింత రెచ్చగొట్టేలా మాట్లాడిన ట్రంప్ ఏం సాధించారని చైనా అధికార 'పీపుల్స్ డైలీ' తన సంపాదకీయ పేజీలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ గుండెలు బాదుకుంటూ చేసిన హెచ్చరికలతో లాభం లేదని, ఆయన ప్రసంగం ఉత్తర కొరియా మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేలా చేసిందని, వారిలో భయం పెరిగే కొద్దీ క్షిపణి పరీక్షలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని ట్రంప్ మరిచారని అభిప్రాయపడింది.
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్యాంగ్ యాంగ్ (ఉత్తర కొరియా) పై యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ విధించిన ఆంక్షలు ప్రభావం చూపబోని ఆయన అన్నారు. ఉత్తర కొరియా దూకుడు విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అగ్ర దేశం, మరింత రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సరికాదని తెలిపారు. ఉత్తర కొరియా మిసైల్ పరీక్షల వెనుక చైనా ఉందని వచ్చిన విమర్శలనూ ఆయన కొట్టి పారేశారు. అంతర్జాతీయ సమాజానికి చైనాను ఓ బూచిగా చూపే ప్రయత్నం జరుగుతోందని, దీన్ని సహించబోమని హెచ్చరించారు.