sindhuram: హిందూ సంప్రదాయాల్లో అత్యంత కీలకమైన దానిపై నిషేధం దిశగా అమెరికా!
- సిందూరంలో స్వల్ప మోతాదులో సీసం
- పిల్లల ఐక్యూపై ప్రభావం
- మెదడు కణాలను నిర్వీర్యం చేస్తుంది
- నిషేధించాలంటూ ప్రభుత్వాన్ని కోరనున్న శాస్త్రవేత్తలు
హిందూ సంప్రదాయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన వాటిలో ఒకటి సిందూరం. సంప్రదాయ వేడుకలు, ఆలయాల్లో వీటికి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. బొట్టును పెట్టుకోవడం హిందూ మహిళల జీవన విధానంలో ఓ భాగం. సిందూరాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే సిందూరాన్ని పెట్టుకోవడం వల్ల చిన్న పిల్లల్లో ఐక్యూ స్థాయులు పడిపోతున్నాయని అమెరికాలోని రట్గర్స్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. సిందూరంలో స్వల్ప మోతాదులో సీసం ఉన్నట్టు పరిశోధనలో తేలిందని వారు తెలిపారు. భారత్, అమెరికాల నుంచి సేకరించిన గ్రాము సిందూరంలో కనీసం ఒక మైక్రోగ్రాము సీసం ఉన్నట్టు వారు గుర్తించారు.
సీసం కలిసిన సిందూరాన్ని వాడటం ఎంత మాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నేపథ్యంలో, అమెరికాకు సిందూరాన్ని తీసుకురావడాన్ని, అమ్మడాన్ని నిషేధించాలని వారు ఎఫ్డీఏకు సిఫారసు చేయనున్నారు. మెదడులోని కొన్ని కణాలను సీసం నిర్వీర్యం చేస్తుందని వారు హెచ్చరించారు. దక్షిణాసియా వ్యక్తుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనబడ్డాయని చెప్పారు.