Filipinos: డ్రగ్స్ రవాణా ఆరోపణలు నిజమైతే... నా కొడుకైనా ఎక్కువ కాదు: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
- డ్రగ్స్ ఆరోపణలతో 3,800 మందిని అంతమొందించిన ఫిలిప్పీన్స్ ప్రభుత్వం
- డ్రగ్ మాఫియా పేరు వినపడితే చంపేయండి
- ఆరోపణలు నిజమైతే నా కొడుకైనా ఎక్కువ కాదు
- ఈ విషయం నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పాను
డ్రగ్ మాఫియాపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె ఎంత కఠిన నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం వ్యతిరేకించినా ఆయన ఏమాత్రం చలించరు. డ్రగ్ మాఫియాను అంతమొందించేందుకు తనను అధ్యక్షుడిగా చేయాలని గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత డ్రగ్ మాఫియా పేరు వినపడితే కాల్చిచంపేయమని, ఏం జరిగినా తరువాత తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అధికారం చేపట్టిన అనంతరం 3,800 మంది డ్రగ్ సంబంధాలు కలిగిన వారిని ఎన్ కౌంటర్ చేశారంటే ఆయన చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి డ్యుట్టరే కుమారుడు డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై డ్యుట్టరే నోరు విప్పారు. ఆరోపణలు నిజమైతే తన కొడుకైనా ఎక్కువ కాదని అన్నారు. చైనా డ్రగ్ డీలర్లతో డ్యుట్టరే కుమారుడు చేతులు కలిపి డ్రగ్స్ తీసుకొస్తున్నాడని ప్రతిపక్ష నేత ఆరోపించారు. దానిపై ఆయన వివరిస్తూ, నా పిల్లలకు డ్రగ్ మాఫియాతో ఎలాంటి సంబంధాలు లేవని గతంలోనే స్పష్టంగా చెప్పానన్నారు. తాను చెప్పినట్టు కాకుండా ఒకవేళ వారు అక్రమ రవాణాకు పాల్పడితే వారిని పట్టుకుని చంపేయమని సలహా ఇచ్చారు. అలా చేస్తే తనను ఎవరూ వేలెత్తి చూపలేరని ఆయన తెలిపారు. తన కుమారుడికి కూడా ఈ విషయం చెప్పానని ఆయన అన్నారు. అలా చంపిన పోలీసులకు రక్షణ కూడా కల్పిస్తానని ఆయన తెలిపారు.