south Korea: ఉత్తరకొరియాపై ఆంక్షలు ఎత్తేయాలి.. లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే!: చైనా
- ఉత్తరకొరియా అంటే భయంతోనే దక్షిణకొరియా అమెరికాను ఆశ్రయించింది
- థాడ్ వ్యవస్థను మోహరించినా దక్షిణ కొరియా భయపడుతోంది
- ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, అమెరికా మధ్య చర్చలు జరగాలి
- విఫలమైతే ఇక మూడో ప్రపంచ యుద్ధమే
చైనా కుట్రలు కుయుక్తుల గురించి ప్రపంచానికి తెలిసిందే. ఆ దేశం ఏదైనా చెప్పాలనుకుంటే ముందుగా దాని గురించి తన అధికారిక మీడియాలో కథనాలు ప్రసారం చేస్తుంది. ఆ తరువాత ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలపై చైనా ఆందోళన చెందుతోంది. అధికారిక ఎగుమతి, దిగుమతులపై ఈ ప్రభావం పడడంతో దొంగచాటుగా ఆ తరహా కార్యకలాపాలు సాగిస్తూనే దీనికి కారణమైన అమెరికాపై మండిపడుతోంది. ఈ మేరకు ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. తాజాగా ప్రచురించిన కథనంలో...ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు ఎత్తేయాలని డిమాండ్ చేసింది.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణకొరియా, అమెరికాలు తమ సమాధుల్ని తామే తవ్వుకునే పనిలో నిమగ్నమయ్యాయని తెలిపింది. ఉత్తరకొరియా భయంతోనే దక్షిణకొరియా, అమెరికా మద్దతు తీసుకుందని చైనా మీడియా ఆరోపించింది. దక్షిణ కొరియాలో అమెరికాకు చెందిన యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ (థాడ్) వ్యవస్థను మోహరింపజేసినా ఉత్తరకొరియా దాడి నుంచి తప్పించుకునే అవకాశం లేదని అభిప్రాయపడింది. ఉత్తరకొరియాను ఒంటరి చేసి రెచ్చగొట్టడం వల్ల దక్షిణకొరియా తీవ్రంగా నష్టపోతుందని చైనా హెచ్చరించింది.
ఇలాంటి చర్యలవల్ల ఉద్రిక్తతలు పెరిగి యుద్ధం వచ్చే అవకాశం ఉందని, అలా కాకుండా ఈ మూడు దేశాలు చర్చలు జరపాలని, అలా చర్చలు జరగాలంటే ఈ మూడు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం అవసరం అని చెప్పింది. అలాంటి వాతావరణం ఏర్పడాలంటే ముందు ఉత్తరకొరియాపై ఆంక్షలు ఎత్తేయాలని చైనా తెలిపింది. అదే సమయంలో ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలు ఆపేయాలని డిమాండ్ చేసింది. అలా కాకుండా ఈ మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని హెచ్చరిస్తోంది.