TRS mp: గుత్తా సుఖేందర్ రెడ్డి మరదలి ఆత్మహత్యకు కారణం ఇదే.. సూసైడ్ నోట్ లభ్యం
- లభ్యమైన సూసైడ్ నోట్
- మానసిక వేదనను అనుభవించిన శ్రీలత
- గుత్తాతో భూవివాదాలు
- మానసిక క్షోభకు గురి చేసిన భర్త అక్రమ సంబంధం
టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా మహేందర్ రెడ్డి భార్య శ్రీలత (45) నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలోని సొంతింట్లో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. మహేందర్ రెడ్డి ప్రైవేట్ స్కూల్ ను నడుపుతుండగా, శ్రీలత వ్యవసాయ పనులను చేసుకుంటూ గేదెలను సాకుతున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కుమార్తె ఎంటెక్ చదువుతోంది. కుమారుడు బీటెక్ చదువుతున్నాడు.
శ్రీలత మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభించింది. సూసైడ్ నోట్ లో ఆమె ఈ విధంగా రాశారు. "ఏ తల్లైనా తన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నాలో ఎలాంటి తప్పులు లేవు. మిమ్మల్ని ఎదిరించి బతికే ధైర్యం నాకు లేదు. చింటు చదువు డిస్టర్బ్ అవుతోంది. చింటూ, నీవు ఎంచుకున్న మార్గం సరైనది. నీవు బాగా చదువుకో. మంచి ఉద్యోగం సంపాదించు. చింటు, మౌనిక నన్ను క్షమించండి".
మరోవైపు గుత్తా సుఖేందర్ రెడ్డితో వీరికి భూవివాదం ఉన్నట్టు తెలుస్తోంది. భర్త మహేందర్ రెడ్డి ప్రవర్తనపై ఆమె మధనపడుతున్నట్టు సమాచారం. ఉరుమడ్లలో ఎంపీ గుత్తాకు ఉన్న కోళ్లఫారంలో పనిచేయడానికి కేరళ నుంచి ఓ మహిళ వచ్చిందని... ఆమెతో మహేందర్ రెడ్డి సన్నిహితంగా ఉన్నారని తెలుస్తోంది. చీటి పాటలో వచ్చిన రూ. 6 లక్షల డబ్బును కూడా సదరు కేరళ మహిళకే ఆయన ఖర్చు చేశారని అంటున్నారు.