Narendra Modi: రెండేళ్లలో 42 శాతం పెరిగిన ప్రధాని మోదీ సంపద.. 50 శాతం తగ్గిన జవదేకర్ ఆస్తుల విలువ!
- భారీగా పెరిగిన మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ఆస్తుల విలువ
- క్షీణించిన ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, అరుణ్ జైట్లీ ఆస్తులు
- విపరీతంగా పెరిగిన జవదేకర్ సతీమణి ఆస్తుల విలువ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంపద రెండేళ్లలో 42 శాతం పెరిగింది. ప్రధానమంత్రి కార్యాలయ వెబ్‌సైట్ ప్రకారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనుల శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆస్తులు 2015-17 మధ్య భారీగా పెరగ్గా, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆస్తులు ఈ రెండేళ్ల కాలంలో కరిగిపోయాయి.
నరేంద్ర సింగ్ తోమర్ ఆస్తులు 67.5 శాతం పెరిగి రూ.53 లక్షల నుంచి రూ.89 లక్షలకు చేరుకున్నాయి. ప్రకాశ్ జవదేకర్ ఆస్తుల విలువ 50 శాతం తగ్గి రూ.1.11 కోట్ల నుంచి రూ.56 లక్షలకు చేరుకుంది. ఇక ప్రధాని నరేంద్రమోదీ ఆస్తుల విలువ 41.8 శాతం పెరిగి రూ.1.41 కోట్ల నుంచి రూ.2 కోట్లకు పెరిగాయి. మరో కేంద్రమంత్రి సదానంద గౌడ ఆస్తులు 42.3 శాతం పెరిగి రూ.4.65 కోట్ల నుంచి రూ.6.62 కోట్లకు చేరుకున్నాయి.
వీరితోపాటు ఉక్కు మంత్రి చౌధరీ వీరేందర్ సింగ్ సంపద 23.5 శాతం పెరిగి రూ.7.97 కోట్ల నుంచి రూ.9.85 కోట్లకు చేరుకోగా సుష్మా స్వరాజ్ ఆస్తులు రూ.4.55 కోట్ల నుంచి రూ.5.34 కోట్లకు, వీకే సింగ్ ఆస్తులు రూ.69 లక్షల నుంచి రూ.78 లక్షలకు పెరిగాయి. పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతి రాజు ఆస్తులు 11.7 శాతం పెరిగి రూ.6.98 కోట్ల నుంచి రూ.7.80 కోట్లకు చేరుకున్నాయి. ఇక ప్రకాశ్ జవదేకర్‌తోపాటు రామ్ విలాస్ పాశ్వాన్ (30.8 శాతం), జేపీ నడ్డా (14.6 శాతం), అరుణ్ జైట్లీ (4.3 శాతం) ఆస్తులు కూడా క్షీణించాయి.
విచిత్రం ఏమిటంటే జవదేకర్, పాశ్వాన్ ఆస్తుల్లో క్షీణత నమోదు కాగా వారి భార్యల ఆస్తులు మాత్రం రాకెట్ స్పీడ్‌తో పెరిగిపోవడం గమనార్హం. ఈ రెండేళ్ల కాలంలో జవదేకర్ సతీమణి ప్రచ్చి జవదేవకర్ ఆస్తుల విలువ ఏకంగా 190 శాతం పెరగ్గా, పాశ్వాన్ సతీమణి రీనా పాశ్వాన్ ఆస్తులు కూడా 14.9 శాతం పెరిగాయి.