pakistan: పాకిస్థాన్ కు వినాశకాలం దాపురించింది: ఐరాసలో నిప్పులు చెరిగిన సుష్మా స్వరాజ్
- అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది ఎవరు?
- ఇండియా ఐటీ రంగంలో, పాక్ ఉగ్ర రంగంలో ముందున్నాయి
- పీఓకే, బెలూచ్ లలో హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాక్
- పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం
- ఐరాస 72వ వార్షిక సమావేశంలో సుష్మా స్వరాజ్
హింస, అరాచకాలను ప్రోత్సహిస్తూ, పాకిస్థాన్ ఉగ్రవాదుల కర్మాగారంగా మారిందని భారత్ మరోసారి విరుచుకుపడింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 72వ వార్షిక సమావేశంలో ప్రపంచ దేశాల ముందు పాక్ వైఖరిని అడుగడుగునా తూర్పారబడుతూ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాకిస్థాన్ కు వినాశకాలం దాపురించిందని వ్యాఖ్యానించారు. నిత్యమూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ వైఖరిని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. ఒకేసారి స్వాతంత్ర్యం పొందిన భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఎవరు అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నారో అందరికీ తెలుసునని అన్నారు. ప్రపంచ ఐటీ రంగంలో ఇండియా ప్రబల శక్తిగా దూసుకెళుతుంటే, అంతే స్థాయిలో ఉగ్రవాదులను తయారు చేయడంలో పాక్ ముందు నిలిచిందని అన్నారు. ఉగ్రవాదులను ప్రపంచానికి ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశం పాకిస్థానేనని అన్నారు.
ఉగ్ర దందాలకు నిలయంగా మారి భారత్ సహా ఎన్నో దేశాలను అస్థిర పరిచే ప్రయత్నం చేస్తున్న పాకిస్థాన్ కు గట్టి బుద్ధి చెబుతామని సుష్మా స్వరాజ్ హెచ్చరించారు. తమ దేశానికి భయపడి జమ్మూ కాశ్మీర్ ప్రజలను భారత్ అణచివేస్తోందని పాక్ ప్రధాని అబ్బాసీ చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. భారత్ పై పాకిస్థాన్ నిత్యమూ యుద్ధానికి దిగుతోందని, పీఓకేతో పాటు బెలూచ్ తదితర ప్రాంతాల్లో పాక్ సైన్యం ఉగ్రవాదులతో కలసి హత్యలు, అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతోందని విమర్శించారు. తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకు పాక్ కృషి చేస్తోందని, ఆ శ్రమలో ఏ కొద్ది మొత్తాన్ని అభివృద్ధిపై పెట్టినా, ప్రపంచం మరింత సురక్షితమవుతుందని హితవు పలికారు. రెండు దేశాల మధ్యా స్నేహపూర్వక బంధం ఉండాలని భారత ప్రధాని ప్రయత్నిస్తుంటే, ఆయన హస్తాన్ని ఎందుకు అందుకోవడం లేదని ప్రశ్నించారు.
"మేం పేదరికంతో పోరాడుతున్నాం. కానీ మా పొరుగుదేశం పాకిస్థాన్ మాతో పోరాడుతోంది. రెండు రోజుల క్రితం పాక్ ప్రధాని షాహిద్ ఖాఖన్ అబ్బాసీ ఇదే వేదిక మీద మాపై అనేక ఆరోపణలు చేశారు. మేం తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నామని ఆరోపించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో వినేవారంతా ఆశ్చర్యపోయారు. హక్కుల ఉల్లంఘనకు యథేచ్ఛగా పాల్పడుతూ అనేక మంది ప్రజల ప్రాణాలను తీస్తున్నది వారే. ఇక్కడ నిలబడి మాకు మానవత్వం గురించి మానవ హక్కుల గురించి పాఠాలు చెబుతున్నారు. లాహోర్ డిక్లరేషన్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలకు పాక్ తూట్లు పొడుస్తోంది" అని సుష్మా తన పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ఐరాసలో భారత రాయబారి ఈనామ్ గంగూలీ పాక్ వైఖరిని ఎండగట్టిన మరుసటి రోజే సుష్మా ఈ ప్రసంగం చేయడం గమనార్హం.