dasara: పండగొచ్చిందోయ్... సొంతూరుకు జనాల క్యూ... ఖాళీ అవుతున్న హైదరాబాద్!
- గ్రామాలకు పయనమైన లక్షలాది మంది
- 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు
- ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా
దసరా పర్వదినాన్ని తమ కుటుంబీకులు, బంధుమిత్రుల నడుమ ఉత్సాహంగా జరుపుకోవాలన్న కోరికతో లక్షలాది మంది సొంత ఊర్లకు బయలుదేరుతుండటంతో, హైదరాబాద్ మహానగరం ఖాళీ అవుతోంది. పండగ ఇంకా ఐదు రోజులు ఉండగానే ఇప్పటికే రోడ్లపై రద్దీ తగ్గిపోయింది. స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించడంతో, పల్లెబాటకు పట్టిన వారితో బస్టాండులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రద్దీని తట్టుకునేందుకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలు సుమారు 5 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నాయి.
వీటిల్లో టీఎస్ ఆర్టీసీ 3,600 బస్సులను హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు నడుపుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 1000 వరకూ అదనం. ఈ నెల 19 నుంచి రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, 26 నుంచి ఈ సంఖ్యను మరింతగా పెంచుతామని అధికారులు వెల్లడించారు. ఈ బస్సులన్నింటికీ రిజర్వేషన్లు ముందుగానే చేసుకోవచ్చని పేర్కొన్నారు.
మరోపక్క, వివిధ ప్రాంతాలకు రైళ్లలో చేరుకోవాలని భావించే వారితో రైల్వే స్టేషన్లు కిక్కిరిసి ఉన్నాయి. నిత్యమూ తత్కాల్ టికెట్ల కోసం చాంతాడంత క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ఏ రైల్లోనూ బెర్తులు ఖాళీగా లేని పరిస్థితి నెలకొంది. ప్రత్యేక రైళ్లను కొన్ని ప్రకటించినా, అవి డిమాండ్ ను ఏ మాత్రమూ తీర్చలేవన్న విమర్శలు వస్తున్నాయి. ఇక సందట్లో సడేమియాగా ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల నడ్డి విరుస్తున్నాయి. రేట్లను అమాంతం పెంచేసి, సాధారణ స్థాయి టికెట్ ధరతో పోలిస్తే రెండింతలు, మూడింతలు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి.
ఇక ఈ సెలవుల సీజన్ లో ఊర్లకు వెళ్లేవారికి పోలీసులు సైతం తగు జాగ్రత్తలు చెబుతున్నారు. తాళం వేసేముందు సమీప పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. దొంగలు స్వైర విహారం చేసే ప్రమాదమున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.