kancha ilaiah: నువ్వు ఆర్యవైశ్యుల లాయర్ వి: టీవీ9 మురళీకృష్ణను గద్దించిన కంచె ఐలయ్య
- నాపై జరిగిన దాడిని టీవీ చానల్స్ చూపించలేదు
- పదేపదే నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు?
- పుస్తకం రాసే హక్కు నాకుంది
- ప్రొఫెసర్ కంచె ఐలయ్య
తనపై అగ్రవర్ణాలు దాడి జరుపుతూ ఉంటే ఏ మీడియా చానల్ కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య, మాల మాదిగలను, సమాజంలో అణగదొక్కుతున్న వారి సమస్యలను ఎందుకు బయటకు తేవడం లేదని ప్రశ్నించారు. తెలుగు న్యూస్ చానల్ టీవీ9 నిర్వహించే 'ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తాను ఎక్కువగా టీవీ చానల్స్ చూడనని, చూసే వాటిల్లో ఏవీ తనపై దాడిని చూపించలేదని అన్నారు.
ఆ సమయంలో మురళీ స్పందిస్తూ, పరకాలలో దాడిని గురించి చానల్స్ ప్రముఖంగానే చూపాయని గుర్తు చేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యానాలతో ఉన్నందునే ఈ పుస్తకంపై విమర్శలు వస్తున్నాయని అనగా, "మిస్టర్ మురళీ... యువార్ నాట్ మై జడ్జ్ నార్ యువార్ మై లాయర్. యువార్ ఏ లాయర్ ఆఫ్ ఆర్యవైశ్య... ఐడోంట్ బాదర్" అన్నారు. ఇలా పుస్తకం రాసే హక్కు ఉందా? అని పదేపదే ఎందుకు తనను ప్రశ్నిస్తున్నారని అడిగిన ఐలయ్య, తనకా హక్కుందని బల్లగుద్ది చెప్పారు. పుస్తకం నచ్చకుంటే కోర్టుకు పోవాలిగానీ, తనను టార్గెట్ చేస్తూ, హత్యాయత్నాలకు దిగడం ఏంటని ప్రశ్నించారు.
"టీజీ వెంకటేశ్ తనను నడిరోడ్డు మీద నరుకుతానని అన్నాడు. టీజీ వెంకటేశ్ ను ఎలా నరుకుతారండీ అని ఎవరైనా అడిగారా? ఆయన మీద డిబేట్ పెట్టారా? జాతీయ మీడియా, అన్ని రాజకీయ పార్టీలు నాపై దాడిని ఖండించలేదు,. నేను మరో గౌరీ లంకేష్ అయిన తరువాత స్పందిస్తారేమో" అని అన్నారు. తనను లంకేష్ కన్నా ఘోరంగా చంపేస్తారేమోనన్న ఆందోళన ఉందని చెప్పారు. అందుకే తాను పోలీసులను ఆశ్రయించానని చెప్పారు.
తనను అడుగుతున్న ప్రశ్నలు కోర్టులో ముద్దాయిని నిలబెట్టి అడుగుతున్నట్టు అనిపిస్తున్నాయని, ఈ హక్కు ఎవరికీ లేదని, టీవీ చానల్స్ ఏమీ లాయర్స్ కాదని అన్నారు. "ఆర్యవైశ్యులు మీకు డబ్బిచ్చి పెట్టుకున్నారా? లేదా? నాకు తెలియదు. ఐయామ్ సారీ... ఇంటరాగేషన్ లా ఇంటర్వ్యూ ఉండరాదు. నేను కింది కులపోడిని. ఎన్నడూ రాయని కులపోడిని. కులాలు ఉన్నాయి కాబట్టి చర్చించాల్సిందే. కులాలు ఉన్న చోట వర్గ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి" అన్నారు.