comptroller and auditor general: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ మెహ్రీశీ
- హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్
- శశి కాంత్ శర్మ స్థానంలో నియామకం
- ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి కోవింద్
హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ మెహ్రీశీ సోమవారం ఉదయం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)గా బాధ్యతలు స్వీకరించారు. మాజీ 'కాగ్' శశికాంత్ శర్మ గత శుక్రవారం పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజీవ్ మెహ్రీశీతో ప్రమాణ స్వీకారం చేయించారు.
మెహ్రీశీ 1978 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన వారు. రాజస్థాన్‌కు చెందిన రాజీవ్ మెహ్రీశీ యూకేలోని గ్లాస్గోలో ఉన్న స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి వంటి పదవులను ఆయన నిర్వర్తించారు. అలాగే కేంద్రంలో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్ శాఖల్లో పనిచేశారు.