shopping list: ఇలా కూడా రాయొచ్చా?.. పూర్తి స్పష్టతతో భర్తకి యువతి రాసిచ్చిన కూరగాయల లిస్ట్‌ను చూడండి!
- భర్తతో వచ్చే ఈ గొడవలని దృష్టిలో పెట్టుకుని ఓ మహిళ రాసిన ఓ కూరగాయల లిస్టు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్
- కూరగాయల రంగు, సైజు, బరువు ఎంత ఉండాలో స్పష్టంగా రాసి భర్తకు ఇచ్చిన మహిళ
- అందుకు తగ్గ బొమ్మలు కూడా వేసిన వైనం
ఇంటికి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండంటూ భర్త ఆఫీసుకి వెళ్లేటప్పుడు భారతీయ మహిళలు ఓ లిస్టు రాసి భర్త జేబులో పెట్టడం చూస్తుంటాం. అయితే, భార్య చెప్పిన కూరగాయల లిస్టులో భర్త ఏదైనా తీసుకురాకపోతే భార్య గొడవ పెట్టుకుంటుంది... లేదా పుచ్చిపోయిన కూరగాయలు తెచ్చినా, చెప్పినదాని కంటే తక్కువగా తెచ్చినా భర్తపై మండిపడుతుంది. దీంతో భర్త కూడా గొడవకు దిగి నువ్వు రాసిందే తెచ్చానని చెబుతాడు. ‘అందులో బెండకాలు తీసుకురమ్మని రాశావు కానీ అవి ఎలా ఉండాలో రాయలేదు కదా?’ అని భర్త దబాయిస్తాడు.
భర్తతో వచ్చే ఈ గొడవలని దృష్టిలో పెట్టుకుని ఓ మహిళ రాసిన ఓ కూరగాయల లిస్టు సోషల్ మీడియాతో వైరల్‌గా మారి వార్తల్లోకెక్కేసింది. ఎరా లాందీ అనే యువతి ఏ ప్రాంతంలో ఉంటుందో తెలియదుగానీ ఇటీవల తన భర్తకు ఇచ్చిన కూరగాయల లిస్టుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ లిస్టులో కూరగాయల పేర్లతో పాటు అవి ఎంత బాగా ఉండాలో, వాటి రంగు ఎలా ఉండాలో కూడా రాసింది. టొమాటోలు కిలోన్నర తీసుకురావాలని, వాటిలో కొన్ని పసుపు రంగువి, కొన్ని ఎరుపురంగువి ఉండాలని, వాటికి ఎటువంటి చిన్న మచ్చ కూడా ఉండకూడదని లిస్టులో పేర్కొంది.
ఉల్లిపాయలు చిన్నవిగా ఉండాలని, రౌండ్‌గా ఉన్నవే తీసుకురావాలని, మొత్తం కిలోన్నర తీసుకురావాలని పేర్కొంది. ఇలా అన్ని కూరగాయలు ఎంత క్వాలిటీగా ఉండాలో రాసింది. అంతేకాదు, వాటికి తగ్గ చిన్న చిన్న బొమ్మలు కూడా వేసింది. తన భర్తకు రాసిచ్చిన ఈ లిస్టుని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారిపోయింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. ఆ భార్య మహా తెలివైందని, లాయర్లా ఏ విషయాన్నీ వదలలేదని అంటున్నారు. చివరికి ఉచితంగా నాలుగు మిరపకాయలు షాపు వాడి వద్ద నుంచి తీసుకురమ్మని ఆమె భర్తకు రాసివ్వడం మర్చిపోయిందని ఒకరు కామెంట్ చేశారు.
ఇలా కూడా రాయొచ్చా? అని మరొకరు కామెంట్ చేశారు. ఆమె రాసిచ్చిన విధంగా ఆమె భర్త కూరగాయలు తీసుకురావాల్సిందేనని, క్వాంటిటీ, కలర్, బరువు ఏ మాత్రం తగ్గినా ఆ లిస్టు చూపించి తాను రాసిచ్చిందేంటి? తీసుకొచ్చిందేంటీ? అని నిలదీయవచ్చని నెటిజన్లు అంటున్నారు. ఇదే సమయంలో, భార్య ఎలా వండాలో భర్త కూడా ఓ లిస్టు రాసివ్వాలని, కచ్చితంగా అలా వండకపోతే గొడవ పెట్టుకోవాలని కూడా కొందరు సెటైర్లు వేస్తున్నారు.