modi : ఆర్థిక సలహా మండలిని నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ!
- ముగిసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం
- 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు
- ఆర్థిక వ్యవహారాలతో పాటు పలు అంశాలపై ప్రధానికి సలహాలు ఇవ్వనున్న సలహా మండలి
- నీతి అయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఈ సలహా మండలి
ఈ రోజు ఢిల్లీలో నిర్వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఆర్థిక వ్యవహారాలతో పాటు పలు అంశాలపై ప్రధానికి సలహాలు ఇవ్వడానికి సలహా మండలిని నియమించారు. నీతి అయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ నేతృత్వంలో ఈ సలహా మండలి పనిచేస్తుంది.
ఇందులో సభ్యులుగా సూర్జిత్ బళ్లా, రతిన్ రాయ్, అషీమా గోయల్, సభ్యకార్యదర్శిగా రతన్ వటల్ను నియమించారు. దేశంలోని కీలక అంశాలపై కూడా ప్రధానికి సలహా సంఘం సూచనలు ఇస్తుంది. సమయానుకూలంగా నివేదికలు కూడా ఇస్తుంది. ఈ సమావేశం ముగిసిన తరువాత ప్రధాని మోదీ దీన్ దయాల్ ఉర్జా భవన్ ను ప్రారంభించారు. అలాగే ప్రధాన మంత్రి సహజ్ బిజ్లి యోజన ను ప్రారంభించారు.
కాగా, ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో పాటు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 1,400 మంది ఎమ్మెల్యేలు, 280 మంది ఎంపీలు 2,500 బీజేపీ నేతలు పాల్గొన్నారు.