Ashton Agar: ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ.. సిరీస్ నుంచి లెఫ్టార్మ్ స్పిన్నర్ అగర్ అవుట్!
- అగర్ కుడిచేతి చిటికెన వేలుకి గాయం
- మిగతా రెండు మ్యాచ్ లకు దూరం
- అగర్ స్థానంలో ఆడమ్ జంపా
పర్యాటక జట్టు ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే సిరీస్‌ను కోల్పోయి డీలా పడిన జట్టుకు ఆస్టన్ అగర్ రూపంలో షాక్ తగిలింది. భారత్‌తో జరగనున్న మిగతా రెండు వన్డేలకు ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ దూరం కానున్నాడు. మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అగర్ కుడిచేతి చిటికెన వేలు గాయపడింది. రోహిత్ శర్మ కొట్టిన బంతిని బౌండరీకి వెళ్లకుండా ఆపే క్రమంలో అగర్ డైవ్ చేయడంతో చిటికెన వేలు గాయపడినట్టు జట్టు డాక్టర్ రిచర్డ్ సా తెలిపారు. నిపుణుడిని కలిసిన తర్వాత సర్జరీ అవసరమా? కాదా? అన్న విషయాన్ని నిర్ధారిస్తామని పేర్కొన్నారు. ఈనెల 28న బెంగళూరులో జరగనున్న నాలుగో వన్డేలో అగర్ స్థానాన్ని లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాతో భర్తీ చేసే అవకాశం ఉంది.