Iraq: ఉగ్రవాద ఆరోపణలపై 42 మంది సున్నీ ముస్లింలను ఉరితీసిన ఇరాక్!
- మూడు నెలల్లో ఇది రెండోసారి
- అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర దిగ్భ్రాంతి
- నాసిరియా జైలులో ఈ 42 మంది ఉరితీత
ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న 42 మంది సున్నీ ముస్లింలు దోషులుగా తేలడంతో ఇరాక్ ప్రభుత్వం వారిని ఉరితీసింది. కారు బాంబును పేల్చడం ద్వారా భద్రతా సిబ్బందిని హతమార్చారన్న అభియోగంపై వీరికి మరణశిక్ష విధించింది. సెప్టెంబరు 14న ఇరాక్‌లోని దక్షిణ ప్రాంతంలోని నాసిరియాలో జరిగిన సున్నీ ఆత్మాహుతి దాడిలో 60 మంది మృతి చెందారు.
ఇరాక్ ఉరితీతపై అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమను షాక్‌కు గురి చేసిందని పేర్కొంది. పరిస్థితులు ఏవైనా మరణశిక్ష అనేది ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
నాసిరియా జైలులోనే ఈ 42 మంది సున్నీ దోషులను ఉరి తీసినట్టు న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. మూడు నెలల క్రితం ఇవే ఆరోపణలపై 14 మందిని ఉరితీసింది. నాసిరియాలోని మూడు ప్రాంతాల్లో రెస్టారెంట్, సెక్యూరిటీ చెక్ పాయింట్లలో జరిగిన మూడు దాడులు తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ అప్పట్లో ప్రకటించింది.