revant reddy: కేసీఆర్ ఇక్కడివాడా? వలస వాదేగా?: రేవంత్ రెడ్డి
- ఆయన పూర్వీకులు బీహార్ నుంచి విజయనగరం వచ్చారు
- ఆపై తెలంగాణలో స్థిరపడ్డారు
- ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే గుత్తి కోయలపై అకారణంగా దాడులు
- అసెంబ్లీలో లేవనెత్తుతానన్న రేవంత్ రెడ్డి
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తెలంగాణకు చెందిన వ్యక్తా? అని ప్రశ్నించిన తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి, ఆయన వలసవాది కాదా? అని నిలదీశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన, గుత్తికోయలు ఇక్కడి వారు కానే కాదని వాదిస్తూ, వారిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే అటవీ అధికారులు అడవుల్లో ఉంటున్న గుత్తి కోయలుపై అకారణంగా, అమానుషంగా దాడులకు దిగారని విమర్శించారు.
తెలుగుదేశం నేతలతో కలసి ఓ గూడేన్ని సందర్శించిన ఆయన, కేసీఆర్ పూర్వీకులు బీహార్ నుంచి విజయనగరానికి, ఆ తరువాత తెలంగాణకు వలస వచ్చారని గుర్తు చేసిన ఆయన, తన కొడుకుకు ఆయన గుంటూరులో చదువు చెప్పించుకున్నారని, ఆ తరువాతే అమెరికాకు పంపారని తెలిపారు. తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో గుత్తికోయల అంశాన్ని లేవనెత్తుతానని, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.