BHU: అది లైంగిక వేధింపు కాదు... సింపుల్ ఈవ్ టీజింగ్ మాత్రమే!: బనారస్ వర్శిటీ వైస్ చాన్స్ లర్ కామెంట్ పై భగ్గుమంటున్న విద్యార్థి లోకం!
- విద్యార్థులపై విరిగిన పోలీసుల లాఠీలు
- అమ్మాయిలని కూడా చూడకుండా దాష్టీకం
- ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
- విచారణ కొనసాగుతుందన్న అధికారులు
ప్రతిష్ఠాత్మ బెనారస్ విశ్వవిద్యాలయంలో ఓ మహిళా స్టూడెంట్ ను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ, వందలాది మంది విద్యార్థులు తీవ్ర నిరసనలకు దిగిన వేళ, అవి లైంగిక వేధింపులు కానే కావని, సింపుల్ ఈవ్ టీజింగ్ మాత్రమే జరిగిందని వైస్ చాన్స్ లర్ గిరీష్ చంద్ర త్రిపాఠి వ్యాఖ్యానించడంతో విద్యార్థిలోకం భగ్గుమంది. ఈ ఘటనను పూర్తిగా తప్పుదారి పట్టించారని, కొందరు పనిగట్టుకుని సహ విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు.
నరేంద్ర మోదీ వారణాసికి రానున్న వేళ, ఒక రోజు ముందు ఈ ఘటన జరుగగా, విద్యార్థుల నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో ఉద్యమం మరింత ఉద్ధృతమైన సంగతి తెలిసిందే. పోలీసులు ఓ విద్యార్థినిని నెట్టి కింద పడేయడం, ఆపై ఆమెను లాఠీలతో కొట్టడం వంటి ఘటనలు చోటు చేసుకోగా, వాటికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
విద్యార్థులపై పోలీసుల తీరును విపక్షాలు తప్పుపడుతుండగా, జరిగిన లైంగిక దాడిని, ఈవ్ టీజింగ్ గా కొట్టిపారేసే ప్రయత్నాన్ని వైస్ చాన్స్ లర్ చేస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. కాగా, విద్యార్థుల నిరసనల అంశంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను వివరాలు అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ, అమిత్ షాలు, లాఠీచార్జ్ పై విచారణ జరిపించాలని సూచించారు. వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు పోలీసులను విధుల నుంచి తొలగించామని చెప్పిన ఉన్నతాధికారులు విచారణ కొనసాగుతుందని అన్నారు.