devaragattu: కర్నూలు పోలీసుల వినూత్న ఆలోచన... బన్ని ఉత్సవం రోజు కర్రలు లేకుండా చూస్తున్నారు!
- ప్రతి యేటా ఉత్సవం సందర్భంగా ఎంతో మందికి గాయాలు
- ఇల్లిల్లూ తిరుగుతూ కర్రలను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు
- నిఘా కోసం డ్రోన్ కెమెరాలు వాడతామంటున్న అధికారులు
- 30న జరగనున్న బన్ని ఉత్సవం
బన్ని ఉత్సవం... కర్నూలు జిల్లా దేవరగట్టు మాళమల్లేశ్వరుని ఉత్సవం. దసరా రోజున జరిగే ఈ ఉత్సవంలో స్వామివారి విగ్రహాలను దక్కించుకునేందుకు జరిగే పోరు అంతాఇంతా కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. నెరకిణి, కొత్తపేట, ఎల్లార్తి, అరికెర, ముద్దనగేరి, కురుకుంద, హాలహర్వి మండలాల పరిధిలోని వేలాది మంది ఒకచోట చేరి కర్రలతో కొట్టుకుంటుంటే ప్రతి యేటా ఎంతో మందికి తలలు పగిలి గాయాలవుతుంటాయి.
ఇక పోలీసులు, అధికారులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా, ప్రతి యేటా ఈ ఉత్సవాల్లో గాయపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం సాధ్యమైనంతగా రక్తపాతాన్ని తగ్గించేందుకు పోలీసులు వినూత్న ఆలోచన చేస్తున్నారు. దేవరగట్టు సమీపంలోని గ్రామాల్లో ఏ ఊరిలోనూ కర్రలు లేకుండా చేస్తున్నారు.
ఎక్సైజ్ అధికారులను కలుపుకుని ఆరు బృందాలుగా ఏర్పడి, ఇల్లిల్లూ తిరుగుతూ కర్రలు కనిపిస్తే, వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఉత్సవాల్లో పాల్గొంటారని భావిస్తున్న వారిపై బైండోవర్ కేసులు పెట్టి హెచ్చరిస్తున్నారు. ఈ సంవత్సరం ఉత్సవాల్లో డ్రోన్ కెమెరాలు వాడుతామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని, హింసను తగ్గించడమే తమ ఉద్దేశమని కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్ జెట్టి వెల్లడించారు.