cricket: క్రికెట్లో రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలు.. ఆటగాళ్లు హద్దు మీరితే బయటికే!
- మైదానంలో ఆటగాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే
- బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయంలోనూ నిబంధనలు
- ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేస్తే అనర్హతే
క్రికెట్లో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు రేపటి (సెప్టెంబరు 28)తో మూలన పడనున్నాయి. గురువారం నుంచి సరికొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ) నిబంధనలు రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం.. మైదానంలో ఆటగాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించడం, దురుసుగా ప్రవర్తించడం, అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం.. ఇవన్నీ ఇక మర్చిపోవాల్సిందే. లేదూ.. హద్దుమీరి ప్రవర్తించారో... వెంటనే మైదానం నుంచి బయటకి పంపించేస్తారు.
ఐసీసీ రూపొందించిన తాజా నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్, పాకిస్థాన్-శ్రీలంక మధ్య జరగనున్న టెస్ట్ సిరీస్‌లలో వీటిని అమలు చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా, ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్‌లు మాత్రం పాత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్డీస్ తెలిపారు. కొత్త నిబంధనలు వివరించేందుకు అంపైర్లకు ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ను నిర్వహించినట్టు వివరించారు.
నిబంధనలు ఇలా..
కొత్త నిబంధనల్లో బ్యాట్ పరిమాణంలోనూ మార్పులు చేశారు. బ్యాట్ పొడవు, వెడల్పుల్లో మార్పులు లేకున్నా బ్యాట్ అంచులు, మందంలో మార్పులు చేశారు. బ్యాట్ అంచులు 40 మిల్లీమీటర్ల మందానికి, లోతు 67 ఎంఎంకు మించకూడదు. బ్యాట్ కొలతలు తెలుసుకునేందుకు అంపైర్లకు ప్రత్యేకంగా ఓ కొలమానిని ఇస్తారు. మైదానంలో దురుసుగా ప్రవర్తించే ఆటగాళ్లను తక్షణం బయటకి పంపేస్తారు. పెనాల్టీగా ప్రత్యర్థి జట్టుకు పరుగులు కూడా ఇచ్చే అధికారాన్ని అంపైర్‌కు కల్పించారు.
అంపైర్‌ను బెదిరించినా, ఆటగాళ్లపై భౌతికంగా దాడి చేసినా క్రికెట్ నియమావళిలోని లెవల్-4 తప్పిదంగా భావించి తక్షణం చర్యలు తీసుకుంటారు. తాజా నిబంధనల్లో భాగంగా టెస్టుల్లోనూ డీఆర్ఎస్ ప్రవేశపెట్టారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్లు పట్టే క్యాచ్‌లు, రనౌట్ విషయంలోనూ నిబంధనలు విధించారు. బ్యాట్స్‌మన్ కొట్టే బంతి ఫీల్డర్ ధరించే హెల్మెట్‌కు తాకిన తర్వాత దానిని క్యాచ్ పట్టినా ఇక నుంచి ఔట్‌గానే పరిగణిస్తారు. నో బాల్, బై, లెగ్బైలను ఇక నుంచి ప్రత్యేకంగా స్కోరు చేస్తారు. బ్యాట్స్‌మన్‌ను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించే ఫీల్డర్లపై చర్యలు తీసుకుంటారు. ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేస్తే ఇక బౌలింగ్ వేయడానికి అనర్హుడిగా ప్రకటిస్తారు.