malamahanadu: టీడీపీతో ఇప్పటి వరకు ఉన్నది చాలు.. బయటకు వచ్చేయండి: ఎస్సీలకు మాల మహానాడు పిలుపు
- టీడీపీలో దళితులకు అన్యాయం జరుగుతోంది
- ఎన్టీఆర్ హయాంలో ఎస్సీలకు కీలక పదవులు
- దళితులను నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు
దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ వివక్ష చూపుతోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య మండిపడ్డారు. ఎస్సీలందరూ టీడీపీ నుంచి బయటకు వచ్చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలో మాల, మాదిగ సామాజికవర్గాలకు అన్యాయం జరుగుతోందని... పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో తగిన న్యాయం జరగడం లేదని విమర్శించారు.
ఎన్టీఆర్ హయాంలో ఆర్ అండ్ బీ, రెవెన్యూ, భారీ నీటిపారుదల శాఖలను దళితులకు కేటాయించారని... చంద్రబాబు హయాంలో దళితులకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిందని చెంగయ్య అన్నారు. పొలిట్ బ్యూరో నుంచి దళిత ఎంపీ శివప్రసాద్ ను తొలగించారని చెప్పారు. కాపు సామాజిక వర్గీయుల మెప్పు కోసం మంత్రివర్గం నుంచి పీతల సుజాతను తొలగించారని అన్నారు. గిరిజన మండలికి రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ నేతలను నామినేట్ చేశారని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ ఒత్తిడి వల్లే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారని అన్నారు.