facebook: కొత్త ఫీచర్ ను ఆవిష్కరించనున్న ఫేస్బుక్... రక్తదాతలకు, గ్రహీతలకు ప్రయోజనకారి!
- జాతీయ రక్తదాతల దినోత్సవం రోజున ఆవిష్కరణ
- రక్తదానానికి ప్రచారం కల్పించడమే ధ్యేయం
- సులభతరం కానున్న బ్లడ్ డొనేషన్
ఇటీవల అత్యవసరంగా రక్తం అవసరమైనవారు దాతల కోసం ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వెబ్సైట్ల సహాయం తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ రక్తదాతల దినోత్సవం (అక్టోబర్ 1) రోజున సరికొత్త ఫీచర్‌ను ఫేస్బుక్ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా రక్తదానం చేయాలనుకున్న వారు తమ ప్రొఫైల్‌లో బ్లడ్ గ్రూప్ వివరాలను అప్లోడ్ చేయాలి. అలాగే రక్తం అవసరమైన వారు కూడా వారికి కావాల్సిన బ్లడ్ గ్రూప్‌తో పోస్ట్ చేయాలి. వెంటనే పోస్ట్ చేసిన వారి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సంబంధిత బ్లడ్ గ్రూప్ వారికి నోటిఫికేషన్ వెళ్తుంది.
వారు సమ్మతిస్తే హాస్పిటల్ వివరాలు, లోకేషన్, రక్తం అవసరమైన వారి కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో రక్తదానం చేయడం కుదరకపోతే ఆ నోటిఫికేషన్‌ను షేర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీని వల్ల రక్తదానం కోసం రిజిస్టర్ చేసుకోని వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. రక్తదానం చేయడానికి ప్రచారం కల్పిస్తూ, దాతలను, గ్రహీతలను, బ్లడ్ బ్యాంకులను ఒకేతాటి మీదకి తీసుకురావడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఫేస్బుక్ దక్షిణాసియా ప్రతినిధి హేమ బూదరాజు తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.