assam: గిన్నిస్ ఎంట్రీకి వెదురుతో రూపొందించిన దుర్గా మాత ఆకృతి!
- అత్యంత ఎత్తైన వెదురు విగ్రహం
- తుపాను ధాటికి గురైనా సకాలంలో నిర్మాణం పూర్తి
- భక్తులను ఆకర్షిస్తున్న గువహటి అమ్మవారు
అస్సాంలోని గువహటి ప్రాంతంలో నిలబెట్టిన 101 అడుగుల వెదురు దుర్గా మాత ఆకృతిని గిన్నిస్ బుక్ రికార్డుల కోసం పంపించనున్నారు. అత్యంత ఎత్తైన వెదురు విగ్రహంగా దీనిని గిన్నిస్కి నామినేట్ చేయనున్నారు. బిష్ణుపూర్ సర్భజనీన్ పూజ కమిటీ వారు నిలబెట్టిన ఈ విగ్రహం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీన్ని అసోంకు చెందిన సెట్ డిజైనర్ నూరుద్దీన్ అహ్మద్ రూపొందించారు.
దాదాపు 70 శాతం నిర్మాణం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 17న వచ్చిన తుపాను కారణంగా ఈ విగ్రహం కొంత మేరకు దెబ్బతింది. అయినప్పటికీ నమ్మకం కోల్పోకుండా దుర్గాష్టమికి రెండు రోజుల ముందే విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీన్ని అత్యంత ఎత్తైన వెదురు విగ్రహంగా పేర్కొంటూ ఇప్పటికే నిర్వాహకులు గిన్నిస్ వారికి లేఖ రాశారు. ప్రస్తుతం గిన్నిస్ వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు అహ్మద్ తెలిపారు.
అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో తమ విగ్రహం కచ్చితంగా స్థానం సంపాదిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుర్గా పూజ కోసం పర్యావరణహిత విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రచారం చేయడం కోసం, అలాగే ప్రపంచానికి వెదురు ప్రాముఖ్యతపై అవగాహన తీసుకురావడం కోసం తాము ఈ ప్రయత్నం చేసినట్లు అహ్మద్ పేర్కొన్నారు. దాదాపు 6000లకు పైగా వెదురు కర్రలను ఉపయోగించి ఈ విగ్రహాన్ని తయారుచేశారు. పండగ పూర్తయిన తర్వాత ఈ వెదురును ఇతర అవసరాలకు ఉపయోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.