nairuti: వర్షాలు కురిపించిన రుతుపవనాలు వెళ్లిపోతున్నాయి: ఐఎండి
- 12 రోజులు ఆలస్యంగా మరలిన నైరుతి
- అందువల్లే ఇంకా వర్షాలు కురుస్తున్నాయి
- ఐఎండీ డైరెక్టర్ కేజే రమేశ్
- తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు
గడచిన రెండున్నర నెలలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన నిత్యమూ ఎక్కడో ఒకచోట వర్షాలను కురిపించిన నైరుతీ రుతుపవనాలు వెనుదిరగడం మొదలైందని, రుతుపవనాలు వెళ్లిపోతున్నాయని ఐఎండి (భారత వాతావరణ విభాగం) అధికారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం రుతుపవనాలు వెళ్లిపోయే ప్రక్రియ 12 రోజులు ఆలస్యంగా జరుగుతోందని, అందువల్లే కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఏపీల్లో ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ డైరెక్టర్ కేజే రమేశ్ తెలిపారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకూ సాధారణంతో పోలిస్తే 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, వాయవ్య రాష్ట్రాల్లో వర్షపాతం మరింత తక్కువగా ఉందని ఆయన అన్నారు. పంజాబ్, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల నుంచి 27వ తేదీ నుంచి రుతుపవనాలు వెనక్కు తిరిగాయని, మరో రెండు రోజుల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా వెనక్కు మరిలే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
కాగా, నిన్న సాయంత్రం నుంచి కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వేదావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, కర్ణాటక మధ్య రవాణా సౌకర్యానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. కర్ణాటకలో కురిసిన వర్షాలకు తుంగభద్రలో ప్రవాహం పెరిగింది. మరోవైపు ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద స్థిరంగా సాగుతోంది. కర్నూలుతో పాటు అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో గత రాత్రి కురిసిన వర్షానికి పలు చోట్ల రహదారులపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ ఉదయం ట్రాఫిక్ పల్చగా ఉన్నప్పటికీ, వాహనాలు నెమ్మదిగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.