anchor suma: టీవీ యాంకర్ సుమకు 'ధైర్య' అవార్డు.. 'ఇక భయపడే అర్హత కోల్పోయా'నని సుమ చమత్కారం!
- అవార్డునిచ్చిన 'అన్నమయ్య భావన వాహిని'
- సత్కరించిన ప్రభుత్వ సలహాదారు రమణాచారి
- సమాజానికి సేవ చేయాలని పిలుపు
ఏదైనా సాధించినప్పుడు కలిగిన సంతోషం కన్నా, మనం చేసే పనితో సమాజంలో నలుగురికి కలిగే సంతృప్తి నిజమైన ఆనందాన్ని ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి వ్యాఖ్యానించారు. దసరా పర్వదినం సందర్భంగా హైదరాబాద్, మాదాపూర్ లోని అన్నమయ్యపురంలో జరిగిన నాద బ్రహ్మోత్సవం కార్యక్రమంలో ప్రముఖ టీవీ యాంకర్ సుమకు 'ధైర్య' అవార్డును బహూకరించిన ఆయన, అనంతరం మాట్లాడారు.
ఓ యాంకర్ గా, ఓ గృహిణిగా, ఓ విద్యావంతురాలిగా, ఓ బహుభాషా ప్రవీణురాలిగా సుమ అన్ని రంగాల్లో రాణిస్తోందని, ఈ అవార్డుకు ఆమె అర్హురాలని అన్నారు. యువత, ముఖ్యంగా మహిళలు మరింత ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 'అన్నమయ్య భావన వాహిని' ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
అవార్డును అందుకున్న అనంతరం సుమ మాట్లాడుతూ, నేటితో తాను భయపడే అర్హత కోల్పోయానని, ఇక కరెంటు పోయినా, లిఫ్టు ఆగినా, పామును చూసినా 'అమ్మో' అని అరవలేనని చెప్పి, నవ్వులు పూయించింది. ఈ సత్కారం తనకు అపూర్వమైనదని అన్నారు. ఈ సందర్భంగా ఆమె, 'బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే' అంటూ అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి, అందరినీ అలరించారు.