bus accident: రక్తమోడిన రహదారి... సూర్యాపేట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఆరుగురి మృతి

  • తెల్లవారుఝామున 3 గంటల సమయంలో ప్రమాదం
  • 15 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం
  • వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో యాక్సిడెంట్

హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తమోడింది. సాంకేతిక లోపంతో రోడ్డుపై నిలిచివున్న లారీని, వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనగా, ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సూర్యాపేట సమీపంలోని మునగాల మండల మొద్దల చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడగా, అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్న అవనిగడ్డ ఆర్టీసీ డిపోకు చెందిన 'ఏపీ 16 జడ్ 0216' బస్సు, రిపేర్ లో ఉన్న లారీని ఢీకొట్టింది. ముందు వెళుతున్న బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో తెల్లవారుఝామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు గాయపడిన ప్రయాణికులు వెల్లడించారు. ఒక్క క్షణంలో పెద్ద కుదుపు వచ్చిందని, ఏం జరిగిందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ఓ ప్రయాణికుడు విలపిస్తూ చెప్పాడు.

మృతుల్లో ఒకరిని వరప్రసాద్ గా గుర్తించారు. మిగతా వారి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వారిలో మునగాల రమాదేవి, పెద్దపూడి సుబ్బారావు, రాణి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ కు తరలించామని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారని, ఎటువంటి గాయాలు కానివారిని గమ్యస్థానానికి చేర్చామని అధికారులు తెలిపారు. గాయపడిన వారికి కోదాడ, సూర్యాపేట ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News