garikapati narasimharao: ఏ అర్హతా లేకున్నా మన దేశంలో రాణించే మార్గాలివి: గరికపాటి
- అవి రాజకీయం, సన్యాసం
- సన్యాసం చాలా గొప్పది.. కానీ ఇప్పుడు మారిపోయింది
- కళ్లు మూసుకుని కూర్చుని డబ్బు సంపాదించేస్తున్నారు
- గరికపాటి కీలక వ్యాఖ్యలు
ఇండియాలో ఎటువంటి కనీస అర్హతా లేకున్నా ప్రవేశించగలిగే మార్గాలు రెండున్నాయని, అవి సన్యాసం, రాజకీయమని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు. పని లేదని ఎవరు భావిస్తున్నా ఈ రెండు రంగాలు స్వాగతం పలుకుతుంటాయని వ్యంగ్యంగా అన్నారు. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో గుర్మీత్ బాబా వ్యవహారం ప్రస్తావనకు రాగా గరికపాటి ఈ వ్యాఖ్యలు చేశారు.
సన్యాసం చాలా గొప్పదని, శంకరాచార్య కాలం నాటికి, కంచి పరమాచార్య కాలానికి, ప్రస్తుతానికి ఎంతో తేడా వచ్చేసిందని అన్నారు. ఏ విద్య చేతగాకున్నా, కాషాయం కట్టుకుని ఓ చోట కూర్చుని సంపాదించుకోవచ్చని అన్నారు. కాసేపు కళ్లు మూసుకుని అప్పుడప్పుడూ కళ్లు తెరిచి ఏదో ఆలోచిస్తున్నట్టు గాల్లోకి చూస్తే సాయంత్రానికి 500 రూపాయలు, అరడజను అరటిపళ్లు ఖాయంగా వస్తాయని అన్నారు. ఆ పూట హాయిగా వెళ్లిపోతుందని చెప్పారు.
బాబాలు, దొంగస్వాములు పెరుగుతున్నారని, ఇదే సమయంలో నిజమైన బాబాలు కూడా ఉన్నారని అన్నారు. చెడ్డ వారి వల్ల మంచి వారి పేరు చెడిపోతోందని ఆయన వాపోయారు. దేవుడి గురించి తెలుసుకోవాలంటే, ఒక వ్యక్తిని ఆశ్రయించాల్సిన అవసరం లేదని, గురువు లేకుండానే దైవం దగ్గరకు చేరవచ్చన్న అవగాహన, ప్రజల్లో చైతన్యం వస్తే ఇటువంటి నకిలీ బాబాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్పారు. తల్లిదండ్రులకు నమస్కరించి పూజిస్తే, ఆధ్యాత్మిక జ్ఞానం అప్రయత్నంగానే సిద్ధిస్తుందని తెలిపారు. దొంగ బాబాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. మీడియా కూడా ఓ దొంగ బాబా బయటపడితే, ఒకటికి పదిసార్లు చూపించడం వల్ల కూడా ప్రజల్లో మార్పు వస్తోందని గరికపాటి అభిప్రాయపడ్డారు.