yashwath sinha: మోదీ నాకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు!: బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా

  • కశ్మీర్ ప్రజలు దూరమవుతున్నారు
  • కశ్మీర్ విషయంలో కేంద్రం వైఖరి సరైంది కాదు
  • 10 నెలల క్రితమే మోదీ అపాయింట్ మెంట్ కోరా
  • ముద్రా బ్యాంక్, జన్ ధన్ యోజన విఫలమయ్యాయి

నోట్ల రద్దు, జీఎస్టీ, దేశ వృద్ధి రేటు తదితర అంశాల గురించి కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఇటీవల నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. సిన్హా వ్యాఖ్యలతో అధికారపక్షంలో కలకలం రేగింది. తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వంపై సిన్హా విమర్శలు గుప్పించారు. కశ్మీర్ అంశంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సమర్థనీయం కాదని ఆయన కుండ బద్దలుకొట్టారు.

జమ్ముకశ్మీర్ ప్రజలను విస్మరిస్తుండటం తనకు ఆవేదన కలిగిస్తోందని అన్నారు. భావోద్వేగాలపరంగా వారికి మనం దూరమవుతున్నామని చెప్పారు. వారు మనపై నమ్మకం కోల్పోయారని... ఈ విషయం తెలుసుకోవాలంటే కశ్మీర్ లోయలో పర్యటించాలని సూచించారు. కశ్మీర్ వివాదానికి ముగింపు పలికే క్రమంలో... ఏదో ఒక దశలో పాకిస్థాన్ కు చోటు కల్పించడం తప్పకపోవచ్చని అన్నారు.

ప్రధాని మోదీని కలిసేందుకు 10 నెలల క్రితమే తాను అపాయింట్ మెంట్ కోరానని... ఇంత వరకు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని సిన్హా తెలిపారు. ముద్రా బ్యాంక్, జన్ ధన్ యోజన వంటి కార్యక్రమాలు విజయవంతమయ్యాయని కేంద్రం చేసుకుంటున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. అయితే, ఈ నెల 14న మోదీ, సిన్హా ఇద్దరూ ఒకే వేదికను పంచుకోనున్నారు. పాట్నా యూనివర్శిటీ శతవార్షికోత్సవాలకు వారిద్దరూ హాజరవుతున్నారు. పాట్నా యూనిర్శిటీ నుంచే పొలిటికల్ సైన్స్ లో సిన్హా గ్రాడ్యుయేషన్ చేశారు.

  • Loading...

More Telugu News