dera sacha sauda: డేరా బాబా ఆశ్రమంలో దొంగలు పడ్డారు
- డేరా బాబా వస్తువుల చోరీ
- కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు కూడా
- అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు
- కట్టుదిట్టమైన భద్రత ఉన్నా... చోరీ జరిగింది
అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ రోహ్ తక్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దత్త పుత్రిక హనీ ప్రీత్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, హర్యాణాలోని డేరా సచ్ఛా సౌదాలో దొంగలు పడ్డారు. డేరాలో ఉన్న గుర్మీత్ కు చెందిన విలువైన దుస్తులు, బూట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
దొంగలు చోరీ చేసిన వాటిలో ముఖ్యంగా సీసీటీవీలు, కంప్యూటర్లు, పలు హార్డ్ డిస్క్ లు, పరుపులు ఉన్నాయి. మరోవైపు, డేరాబాబా అరెస్ట్ తర్వాత అక్కడ అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి తోడు డేరాకు సొంత సెక్యూరిటీ కూడా ఉంది. ఇంత భద్రత మధ్య డేరాలోకి దొంగలు చొరబడటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఐజీ నవదీప్ విర్క్ తెలిపారు.