dasara: రక్తమోడిన దసరా, మొహర్రం... మూడు రాష్ట్రాల్లో మత కలహాలు
- జార్ఖండ్, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో ఘటనలు
- 12 మందికి గాయాలు
- పలు వాహనాలకు నిప్పు పెట్టిన నిరసనకారులు
ఒకే సమయంలో దసరా, మొహర్రం పర్వదినాలు రావడం మూడు రాష్ట్రాల్లో మత కల్లోలాలను రేపగా, పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 12 మంది గాయపడ్డారు. నిరసనకారులు వాహనాలను తగులబెట్టారు. గత నెల 30న దసరా, నిన్న మొహర్రం పండగ రావడంతో రెండు వర్గాల ప్రజల మధ్య గొడవలు చెలరేగాయి. జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ లోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తాయి.
తొలి ఘటన కాన్పూర్ జిల్లా పురామ్ పూర్వ ప్రాంతంలో జరిగింది. హిందువులు అధికంగా ఉన్న ఓ ప్రాంతానికి ముస్లింలు మొహర్రం పేరిట రక్తం చిందించేందుకు రావడంతో గొడవ జరిగింది. ఆపై ఇరు వర్గాలూ రాళ్లను రువ్వుకోగా ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు పెద్దఎత్తున మోహరించి లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఆపై ఇదే తరహా ఘటన కాన్పూర్ జిల్లా రావత్ పూర్ లోనూ జరిగింది. యూపీలోనే బాలియా ప్రాంతంలో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనానికి వెళుతున్న వారిపై రాళ్లు రువ్విన ఘటన నమోదైంది. ఇద్దరు పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవ, రెండు మతాల మధ్య గొడవగా మారగా, రెండు కార్లు, ఆరు మోటార్ బైకులను నిరసనకారులు దగ్ధం చేశారు.
బీహార్ లోని జామై ప్రాంతంలో దుర్గా పూజలు నిర్వహిస్తున్న వారిపై మరో వర్గం వాళ్లు రాళ్లు రువ్విన ఘటన జరిగింది. జార్ఖండ్ లోని జమ్ షెడ్ పూర్, రాంచీ, దల్తోన్ గంజ్ తదితర ప్రాంతాల్లో మత ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. దసరా పూజలు జరుగుతూ ఉండటం, విగ్రహాలు నిమజ్జనాలకు తరలుతుండటంతో, సాధారణంగా వెళ్లే దారిలో కాకుండా మొహర్రం ఊరేగింపునకు మరో దారిలో అనుమతి ఇవ్వడమే అల్లర్లకు కారణమైందని పోలీసు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు.