rain: అత్యవసరం అయితే తప్ప హైదరాబాద్ వాసులు బయటకు రావద్దు: పోలీసులు
- ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మోకాలు లోతు వర్షపు నీరు
- బేగం బజార్ పాత పీఎస్ పరిసరాల్లో 3 అడుగుల మేర చేరిన నీరు
- అఫ్జల్గంజ్ నుంచి మొజాంజాహీ మార్కెట్ వైపు రాకపోకలు బంద్
- వాహనదారుల ఇక్కట్లు.. అధికారుల సూచనలు
హైదరాబాద్లో కురుస్తోన్న భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మోకాలు లోతు వర్షపు నీరు చేరింది. బేగం బజార్ పాత పీఎస్ పరిసరాల్లో 3 అడుగుల మేర వర్షపు నీరు చేరింది. అఫ్జల్గంజ్ నుంచి మొజాంజాహీ మార్కెట్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ వద్ద 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి.
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. మరింత అధ్వానంగా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. దీంతో సంబంధిత అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షం పడుతోంది.