obc: ఓబీసీ వర్గీకరణ కమిషన్‌కు నేతృత్వం వహించనున్న జస్టిస్ జి. రోహిణి
- ఐదుగురు సభ్యుల కమిషన్‌కి నాయకత్వం
- నియమించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- ఓబీసీ రిజర్వేషన్ల అమలులో అసమానతల తొలగింపే లక్ష్యం
ఓబీసీ కులాల్లో రిజర్వేషన్ల అమలులో తలెత్తుతున్న అసమానతలు తొలగించే ఉద్దేశంతో వారిలో బాగా వెనుకబడిన కులాలను గుర్తించి వర్గీకరణ చేసే అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఓ కమిషన్‌ను నియమించారు. ఐదుగురు సభ్యులు ఉన్న ఈ కమిషన్ నాయకత్వ బాధ్యతలను తెలుగు రాష్ట్రానికి చెందిన ఢిల్లీ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి. రోహిణికి ఆయన అప్పగించారు. ఈ కమిషన్‌కి కార్యదర్శిగా కేంద్ర సామాజిక న్యాయం-సాధికారత శాఖ సంయుక్త కార్యదర్శి వ్యవహరించనున్నారు.
ఓబీసీ కులాల్లో బాగా వెనుకబడిన ఓబీసీలకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయోజనాలు లభించేందుకు వర్గీకరణ అవసరమని కేంద్ర సామాజిక న్యాయం - సాధికారత మంత్రిత్వ శాఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. రిజర్వేషన్ అమల్లో అసమానతల గురించి, వాటిని నివారించేందుకు వర్గీకరణ ఎలా ఉపయోగపడనుందనే అంశాల గురించి, అందుకు కావాల్సిన యంత్రాంగం గురించి ఈ కమిషన్ అధ్యయనం చేయనుంది. ఛైర్పర్సన్ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి 12 వారాల్లో కమిషన్ తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది.