bihar: ప్రతి భారతీయుడి కంచంలో ఒక బీహార్ వంటకం ఉండేలా చూస్తా!: నితీశ్ కుమార్
- వచ్చే ఐదేళ్లలో భారీగా నిధులు
- ఆహార భద్రత కల్పించడమే లక్ష్యం
- రైతుల ఆదాయాన్ని పెంచి చూపుతాం
- బీహార్ సీఎం నితీశ్ కుమార్
వచ్చే ఐదేళ్లలో ఆహార భద్రత కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించనున్నట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడి కంచంలో కనీసం ఒక బీహార్ వంటకం ఉండేలా చూడటమే తన లక్ష్యమని, ఇందుకోసం రూ. 1.55 లక్షల కోట్లను రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధికి వెచ్చిస్తామని అన్నారు. ఆహార భద్రతకు తాము పెద్దపీట వేస్తున్నామని, రైతుల ఆదాయాన్ని పెంచడం, సమ్మిళిత వృద్ధి తమ లక్ష్యాలని ఆయన అన్నారు.
నితీశ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను క్యాబినెట్ సెక్రటేరియేట్ సమన్వయ విభాగం అదనపు కార్యదర్శి ఉపేంద్ర నాథ్ పాండే మీడియాకు వెల్లడించారు. 12 విభాగాలను ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం చేయనున్నామని తెలిపారు. వ్యవసాయంతో పాటు పశుసంవర్థక శాఖ, రెవెన్యూ, భూ సంస్కరణలు, నీటి వనరులు, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్ రంగాలపై దృష్టిని సారించామని తెలిపారు.
తాము తలపెట్టిన ప్రాజెక్టులో భాగంగా, ఇప్పటికే అమలవుతున్న పలు కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని, భవిష్యత్తులో బీహార్ వాసులకు ఆహార కొరత రాకుండా చేయడంతో పాటు, మొత్తం దేశానికే ఇక్కడి నుంచి ఆహారాన్ని అందించాలన్నదే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు.