modi temple: మోదీకి గుడి కట్టిస్తోన్న అభిమాని.. 100 అడుగుల విగ్రహం.. 23న భూమిపూజ
- ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రధాని మోదీ ఆలయం
- ఆలయం నిర్మిస్తున్న నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ జేపీ సింగ్
- 30 కోట్ల రూపాయల ఖర్చు
- గుడిలో నరేంద్ర మోదీ విగ్రహంతో పాటు విష్ణు, లక్ష్మి దేవత విగ్రహాలు కూడా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేనియా ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది అభిమానులు ఆయనను దేవుడని అభివర్ణిస్తుంటారు. అలాంటి ఓ అభిమాని ఇప్పుడు 100 అడుగుల మోదీ విగ్రహంతో గుడి కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారిగా పనిచేసి రిటైరైన ఇంజినీర్ జేపీ సింగ్ ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నారు.
ఈ నెల 23 జరిగే భూమిపూజ నిర్వహించనున్నారు. సార్ధన ప్రాంతంలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో మోదీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. మరో రెండేళ్లలో ఈ గుడి నిర్మాణం పూర్తవుతుందని జేపీ సింగ్ చెప్పారు. గుడి కోసం చేయనున్న భూమిపూజకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మోదీ ఆలయం కోసం 30 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
అందులో రూ.10 కోట్లను ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తామని చెప్పారు. భారతావనిని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోన్న మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. మోదీకి గుడి కట్టడం తన జీవితాశయమని, అది ఇప్పటికి నెరవేరనుందని చెప్పారు. ఈ గుడిలో నరేంద్ర మోదీ విగ్రహంతో పాటు విష్ణు, లక్ష్మి దేవి విగ్రహాలు కూడా ఉంటాయని తెలిపారు.