Uttarpradesh: అదృష్టమంటే అతడిదే! గంటలో రెండుసార్లు మృత్యువు కోరల నుంచి తప్పించుకున్న యువకుడు!
- కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి
- ఆసుపత్రికి తరలించిన అంబులెన్స్‌లో భారీ పేలుడు
- భగవంతుడు తనకు రెండుసార్లు పునర్జన్మ ప్రసాదించాడంటున్న యువకుడు
అదృష్టానికి నిర్వచనం ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవ్ కుమార్ మాత్రమే సరిగ్గా చెప్పగలడేమో! ఎందుకంటే, గంట వ్యవధిలో రెండుసార్లు అతడిని మృత్యువు కబళించాలని చూసినా అదృష్టవశాత్తు రెండుసార్లు క్షేమంగా బయటపడ్డాడు. అంతగా అతడికి అదృష్టం ఎలా కలిసొచ్చిందంటే..
బిజ్నూరులోని సద్దరుద్దీన్పూర్కు చెందిన గౌరవ్ కుమార్ (25) గురువారం వేకువజామున పనిమీద బిజ్నూరు వచ్చి, ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో వ్యతిరేక దిశలో వేగంగా వస్తున్న కారు అతడిని ఢీకొట్టింది. దీంతో అంతెత్తున ఎగిరిపడ్డాడు. ‘‘నేను రోడ్డుపై పడిపోయాను. రక్తం కారుతోంది. కళ్లు మూతలు పడుతున్నాయి. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నొప్పి బాధిస్తోంది. అయితే అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదు. అదృష్టం బాగుండబట్టే బతికి బయటపడ్డాను. కానీ లేదంటే ప్రమాదం జరిగిన వెంటనే చనిపోయేవాడిని’’ అని కుమార్ గుర్తు చేసుకున్నాడు.
గాయాలతో రోడ్డుపై పడి ఉన్న అతడిని 108 అంబులెన్స్‌లో నూర్పూర్లోని పీహెచ్‌సీకి తరలించారు. ఇక్కడ రెండోసారి అతడు మృత్యువు నుంచి బయటపడ్డాడు. అంబులెన్స్ నుంచి అతడిని ఆసుపత్రిలోకి తరలించిన సరిగ్గా 15 నిమిషాల తర్వాత అంబులెన్స్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు దెబ్బకు ఆసుపత్రి అద్దాలు పగిలిపోయాయి. దీంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక పరుగులు తీశారు.
అంబులెన్స్‌లోని ఆక్సిజన్ సిలిండర్‌కు మంటలు అంటుకోవడం వల్లే పేలుడు జరిగిందని నిర్ధారించారు. పేలుడు ధాటికి అంబులెన్స్ తునాతునకలైంది. కొన్ని భాగాలు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. కొన్ని ఆ పక్కనే ఉన్న చెట్టుపై పడ్డాయి. గంట వ్యధిలోనే రెండుసార్లు జరిగిన ఈ ఘటనలను ఆసుపత్రి బెడ్‌పై ఉండి తలచుకున్న కుమార్ తన అదృష్టానికి పొంగిపోతున్నాడు. తనకు భగవంతుడు రెండుసార్లు పునర్జన్మ ప్రసాదించాడని చెబుతున్నాడు.