noa jansma: వేధించిన ప్రతి ఒక్కరితో ఓ సెల్ఫీ... ఓ యువతి ధైర్యానికి ప్రపంచం ఫిదా!
- వాటన్నింటినీ ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసిన ఆమ్ స్టర్ డామ్ యువతి
- నెల రోజుల వ్యవధిలో 45 వేల మంది ఫాలోవర్లు
- మగవాళ్లలో అవగాహన పెంచేందుకేనంటున్న నోవా జన్స్ మా
నడిరోడ్డుపై నడుస్తూ వెళుతుంటే గుచ్చి గుచ్చి చూస్తుండటం, కామెంట్లు చేస్తూ, వీలైతే ఇంకో అడుగు ముందుకేసి తాకాలని ప్రయత్నించడం ఎంతో మంది అమ్మాయిలకు అనుభవమే. ఒక్క ఇండియాలోనే కాదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ మహిళలకు ఈ పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. ఇక తనకు ఎదురవుతున్న వేధింపులను ఎదుర్కొనాలని ధైర్యం చేసిన ఓ యువతి చేసిన పనికి ఇప్పుడు మహిళాలోకంతో పాటు అభ్యుదయవాదులంతా ఫిదా అవుతున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే...
ఆమ్ స్టర్ డామ్ లో విద్యను అభ్యసిస్తున్న 20 సంవత్సరాల యువతి నోవా జన్స్ మా. చదువుకోవడానికి వెళుతున్నా, లేదా మరే పనిమీదైనా బయలుదేరినా, నిత్యమూ ఏదో ఒకరకమైన కామెంట్లు వినిపిస్తూనే ఉండేవి. వీటికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని భావించిన ఆమె ఏం చేసిందో తెలుసా? తనను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరితో ఓ సెల్ఫీ దిగి, వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఖాతాను కూడా తెరిచింది. నెల రోజుల వ్యవధిలో తనను వేధించిన 30 మందితో ఫోటోలు దిగి వాటిని అప్ లోడ్ చేసింది. ఇక ఆమె చేస్తున్న పని, రోజుల వ్యవధిలో 45 వేల మంది ఫాలోవర్లను తెచ్చి పెట్టింది. మహిళా లోకం ఫిదా అయింది. లైకులు వెల్లువెత్తాయి.
మహిళల రోజువారీ దినచర్యలపై పురుషులకు మరింత అవగాహన తెచ్చేందుకే తాను ఈ ప్రాజెక్టును చేపట్టానని చెప్పుకొచ్చింది నోవా. తాను రైల్లో ప్రయాణిస్తున్న వేళ, తొలిసారి వేధింపులు ఎదురయ్యాయని, ఆపై ఈ ఆలోచన చేశానని డచ్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇక ఈ నెల రోజుల వ్యవధిలో కామెంట్లు చేసిన వారిలో కేవలం ఒక్క యువకుడు మాత్రమే సెల్ఫీ ఎందుకని ప్రశ్నించాడట. ఆమ్ స్టర్ డామ్ లో వేధింపులకు పాల్పడితే 190 ఫ్రాంక్స్ (రూ. 14 వేలు) జరిమానా ఉంటుందని గుర్తు చేసిన ఆమె, ఇక తనకిప్పుడు వేధింపులు తగ్గాయని, తన సోషల్ మీడియా ఖాతాను ఇదే సమస్యను ఎదుర్కొంటున్న మరో అమ్మాయికి ఇస్తానని పేర్కొంది. ఆమె తీసుకున్న సెల్ఫీలలో కొన్నింటిని మీరూ చూడవచ్చు.