chetan bhagat: ట్వీట్‌లో వ్యాకరణ తప్పిదం చేసిన చేతన్ భగత్... హేళన చేస్తున్న నెటిజన్లు!
- ఆంగ్లంలో నవలల రాసే రచయిత
- తాజ్ మహల్ గురించి ట్వీట్
- నవ్వులు పూయిస్తున్న కామెంట్లు
ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత చేతన్ భగత్ తన ట్వీట్‌లో చిన్న ప్రాథమిక వ్యాకరణ తప్పిదం చేసి, నెటిజన్లకు దొరికిపోయాడు. దీంతో వారంతా ఆయనను హేళన చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజ్ మహల్‌ను ముస్లిం కట్టడంగా అభివర్ణిస్తూ అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించడంపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశాడు.
`ఒక భారతీయుడిగా మీరెప్పుడైనా తాజ్ మహల్‌ని ముస్లిం కట్టడంగా చూశారా?` అంటూ ఆయన ట్విట్టర్ పోలింగ్ నిర్వహించాడు. అందులో `Did you ever, as an Indian, saw the Taj as a ‘Muslim’ monument?` అని రాశారు. ఈ వాక్యంలో వ్యాకరణం ప్రకారం saw అన్న పదం రాదు, see అన్న పదం రావాలి. దీనిని గుర్తించిన నెటిజన్లు నానారకాలుగా కామెంట్లు చేశారు.
`ఇది ప్రాథమిక పాఠశాల స్థాయిలో నేర్చుకోవాల్సిన అంశం`, `ఐఐఎం ఇదే నేర్పిందా?`, `ఆంగ్లంలో రచనలు చేస్తావ్!.. ఈ మాత్రం తెలియదా?` అంటూ కామెంట్లు చేశారు. ఆంగ్లంలో `saw` పదానికి రంపం అని అర్థం కూడా ఉండటంతో - `రంపం పట్టుకుని తాజ్ మహల్ లోపలికి ప్రవేశించనీయలేదు` అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు.