south Korea: ఉత్తరకొరియా న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగిస్తే 21 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు!
- అమెరికా మిత్రదేశాలపై దాడికి దిగే అవకాశం
- ఉత్తరకొరియాను నిలువరించాలంటున్న అమెరికన్ మీడియా
- సరికొత్త టెక్నాలజీతో బాంబులు తయారు చేస్తోందంటున్న అమెరికా
దుందుడుకు ఉత్తరకొరియా తన న్యూక్లియర్ క్షిపణిని వదిలితే కనుక దక్షిణకొరియా, జపాన్ దేశాలకు తీరని నష్టం వాటిల్లుతుందని అమెరికా మీడియా అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రత్యేక కథనాలు ప్రచురించిన అమెరికన్ మీడియా ఉత్తరకొరియా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్స్ ను తయారు చేసుకుంటూ పోతోందని, తద్వారా ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పటికే 1200 టన్నుల హైడ్రోజన్ బాంబును విజయవంతంగా ప్రయోగించిన ఉత్తరకొరియా.. అమెరికాపై ద్వేషంతో దాని మిత్రదేశాలైన దక్షిణకొరియా, జపాన్ లపై దాడికి దిగితే జపాన్ రాజధాని టోక్యోతో పాటు దక్షిణకొరియా రాజధాని సియోల్ లో 21 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంతే కాకుండా మరో 77 వేల మంది తీవ్రంగా గాయపడతారని తెలిపింది.
ఉత్తరకొరియా 2011 నుంచి ఇప్పటి వరకు 98 బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను నిర్వహించిందని అమెరికా మీడియా వెల్లడించింది. ఉత్తరకొరియా సరికొత్త టెక్నాలజీతో మిస్సైళ్ల తయారీకి పూనుకుంటోందని, దాని ప్రయత్నాన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రపంచ దేశాలన్నీ సహకరించాలని అమెరికన్ మీడియా కోరింది.