south Korea: 'యుద్ధం అంటే ఏమిటో ట్రంప్ కి అర్థం కావడం లేదు' అంటున్న డెమొక్రాట్!
- ఉత్తరకొరియాపై సైనిక చర్యకు 1990లోనే అమెరికా ప్రయత్నించింది
- ఉత్తరకొరియాపై సైనిక చర్యకు ప్రయత్నించిన అమెరికా అధ్యక్షులు
- యుద్ధం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం తప్ప ఏమీ సాధించలేం
యుద్ధం విలువ కోట్ల మంది ప్రాణాలని ట్రంప్ తెలుసుకోవడం లేదని డెమోక్రాటిక్ పార్టీ అధికార ప్రతినిధి టెడ్ లూయీ మండిపడ్డారు. వాషింగ్టన్ లో ఆయన మాట్లాడుతూ, ఉత్తరకొరియాతో యుద్ధానికి దిగితే కొరివితో తల గోక్కున్నట్లేనని అన్నారు. 1990లోనే ఉత్తరకొరియాపై సైనిక చర్య తీసుకునేందుకు అమెరికా సిద్ధమైందని, కానీ, ఉత్తరకొరియా ముందు నిలవలేకపోయామని ఆయన సంచలన విషయం బయటపెట్టారు.
అంతేకాక యుద్ధం వల్ల ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుందే తప్ప ఒరిగేదేమి ఉండదని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ఉత్తరకొరియాపై సైనిక చర్య తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, అది సాధ్యం కాలేదని ఆయన తెలిపారు. యుద్ధం సమయంలో సైనికులు, పైలట్లు అనుభవించే మానసిక ఘర్షణ తనకు తెలుసని ఆయన అన్నారు. తాను గతంలో కాలిఫోర్నియా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకే ట్రంప్ ఆచితూచి మాట్లాడాలని ఆయన హితవు పలికారు.