snake: టూరిస్టులకు నిద్రలేని రాత్రిని మిగిల్చిన నాగుపాము!
- హోటల్ లో దూరిన 14 అడుగుల నాగుపాము
- బెంబేలెత్తిన సిబ్బంది, టూరిస్టులు
- రాత్రంతా వెతికినా కనిపించని పాము
- తెల్లవారుజామున రిసెప్షన్ పక్కనే పూల కుండీలో దర్శనం
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నైనిటాల్ లోని క్లాసిక్ హోటల్ లో బస చేసిన టూరిస్టులకు ఓ నాగుపాము కాళరాత్రిని మిగిల్చింది. నైనిటాల్ అందాలను వీక్షించేందుకు 40 మంది పర్యాటకులు క్లాసిక్ హోటల్ లో దిగారు. వారంతా హోటల్ కు చేరి విశ్రాంతి తీసుకుందామనుకున్న సమయంలో 14 అడుగుల పొడవున్న పెద్ద నాగుపాము హోటల్ లో దూరడాన్ని ఒక టూరిస్టు చూశాడు. దీంతో హోటల్ లో కలకలం రేగింది.
అయితే, హోటల్ లో దూరిన పాము ఎక్కడికి వెళ్లిందో తెలియకపోవడంతో, అది ఎవరి రూంలో దూరిందోనని అంతా ఆందోళన చెందారు. హోటల్ సిబ్బంది అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి వెతుకులాట ప్రారంభించారు. రాత్రంతా పాముకోసం వెతగ్గా తెల్లవారుజామున హోటల్ రిసెప్షన్ లోని పూలకుండిలో పాగా వేసిన భారీ పాము కనిపించింది.
ఈ పాము అత్యంత విషపూరితమైనదని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. దానిని తీసుకుని వారు వెళ్లిపోవడంతో హోటల్ సిబ్బంది, టూరిస్టులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ పాము భయంతో రాత్రంతా హోటల్ రూమ్ లలో కిటికీలు మూసేసుకుని, లైట్లు వేసుకుని టూరిస్టులు బిక్కుబిక్కుమంటూ జాగారం చేశారట.