attack: 'నాది అగ్రకులం' అంటూ టీచర్లను కొట్టిన విద్యార్థి.. ఐసీయూలో ఓ టీచర్ కు చికిత్స
- మహారాష్ట్రలోని పుణెలో ఘటన
- తల జుట్టును పొడవుగా పెంచుకున్నాడని మందలించిన ఉపాధ్యాయుడు
- కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన విద్యార్థిపై అట్రాసిటీ కేసు
ఓ అగ్రకుల విద్యార్థి తమ ఉపాధ్యాయులపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది. వాగ్హోలిలోని జోగేశ్వరి హై స్కూల్ అండ్ కాలేజీలో 11వ తరగతి చదువుతోన్న సునీల్ పోపత్ భోర్ (18) అనే విద్యార్థి తల జుట్టును పొడవుగా పెంచుకుని వచ్చేవాడు. అంతేగాక, తరగతి గదిలో క్షమశిక్షణా రాహిత్యంతో వ్యవహరించేవాడు. దీంతో 'ఆ జుట్టేంటీ? నీ తీరేంటీ?' అంటూ ధనంజయ్ అబ్నావే (33) అనే ఉపాధ్యాయుడు మందలించారు.
దీంతో మరాఠా కమ్యూనిటీకి చెందిన సునీల్.. రెచ్చిపోయి కులం పేరుతో టీచర్‌ను తిడుతూ పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేశాడు. గొడవను గమనించిన దర్శన్ చౌదరీ (30) అనే మరో టీచర్ అక్కడకు వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అతడి తలపై కూడా పదునైన ఆయుధంతో దాడి చేసి, అనంతరం స్కూల్ నుంచి పారిపోయాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అట్రాసిటీ నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ టీచర్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై టీచర్ దర్శన్ చౌదరీ మాట్లాడుతూ... ఆ విద్యార్థి 11వ తరగతి గత ఏడాది తప్పాడని, ఇప్పుడు మళ్లీ అదే క్లాస్ చదువుతున్నాడని, ఇటీవల తమ స్కూల్లో ఏర్పాటు చేసిన పేరెంట్స్ మీటింగ్‌కి సునీల్ తన తల్లిదండ్రులను కూడా తీసుకురాలేదని చెప్పారు.
రెండు రోజుల క్రితం ఓ వ్యక్తిని తీసుకొచ్చి, అతడు తన సోదరుడని చెప్పాడని తెలిపారు. పేరెంట్స్ మీటింగ్‌కి తల్లిదండ్రులను మాత్రమే తీసుకురావాలని తాము చెప్పామని అన్నారు. తాజాగా తమ స్కూల్ హెడ్మాస్టర్ ఆ విద్యార్థి తండ్రితో ఫోనులో మాట్లాడాడని తెలిపారు. అయినా తీరు మార్చుకోని సునీల్ అలాగే ప్రవర్తించాడని, ఓ క్యాప్ పెట్టుకుని తరగతి గదిలోకి వచ్చాడని తెలిపారు. సునీల్ దాడిలో గాయపడ్డ ఉపాధ్యాయుడు ధనంజయ్ అబ్నావే ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న ఆ విద్యార్థి కోసం గాలిస్తున్నారు.