krishna river: పూర్తిగా నిండిన శ్రీశైలం... నీటిని వదలాలని చంద్రబాబు సర్కారు లేఖ
- 884 అడుగులకు చేరిన నీటిమట్టం
- వెంటనే సాగర్ కు నీరివ్వాలని కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ
- తెలంగాణను అడిగి సమాధానం ఇస్తామన్న బోర్డు
ఈ సీజన్ లో శ్రీశైలం జలాశయం తొలిసారిగా నిండుకుండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద కొనసాగుతూ ఉండటంతో జలాశయం నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 51,478 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా, నీటిమట్టం 884 అడుగులకు చేరువలో ఉంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 205 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇక ప్రాజెక్టు నిండటం, నైరుతి రుతుపవనాల ప్రభావం కొనసాగుతూ ఉండటంతో, నాగార్జున సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేయాల్సి వుందని, అందుకోసం నీరు అత్యవసరమని పేర్కొంది. కనీసం పైనుంచి వచ్చిన నీటినైనా విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు వదలాలని కోరింది. ఈ లేఖపై తెలంగాణ నీటి పారుదల శాఖ అభిప్రాయాన్ని స్వీకరించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని బోర్డు పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, ఆల్మట్టికి 14,080 క్యూసెక్కులు, నారాయణపూర్ కు 16,481 క్యూసెక్కులు, జూరాలకు 34,172 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆ మొత్తాన్ని దిగువకు వదలుతున్నారు.