US: అమెరికా, సౌదీల మధ్య అతిపెద్ద ఆయుధ డీల్... విలువ రూ. 10 లక్షల కోట్లు!
- థాడ్ వ్యవస్థలను కొనుగోలు చేయనున్న సౌదీ అరేబియా
- ఇటీవలే రష్యాతో సౌదీ రక్షణ ఒప్పందం
- ఆపై అమెరికాతో మరో డీల్
- ఇరాన్ నుంచి రక్షణ కోసమే
యూఎస్, సౌదీల మధ్య అతిపెద్ద ఆయుధ ఒప్పందం కుదిరింది. ఇటీవలే రష్యా నుంచి వాయు మార్గ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసుకునేందుకు సౌదీ డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ డీల్ పై సంతకాలు జరిగిన మరుసటి రోజే, అమెరికా, ఈ తాజా డీల్ గురించిన వివరాలు వెల్లడించింది. లక్ హీడ్ మార్టిన్ తయారు చేసే థాడ్ (టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్) వ్యవస్థలను సౌదీకి అందించనున్నట్టు తెలిపింది. ఈ డీల్ విలువ 15 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9.8 లక్షల కోట్లు) కాగా, రెండు దేశాల మధ్యా కుదిరిన అతిపెద్ద ఒప్పందం ఇదే.
ఇక థాడ్ వ్యవస్థలను యూఎస్ నుంచి కొనుగోలు చేసిన రెండో దేశంగానూ సౌదీ అరేబియా నిలిచింది. గతంలో యూఏఈ కూడా ఇదే వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఇరాన్ ఖండాంతర క్షిపణులను తరచూ పరీక్షిస్తుండటంతోనే, తమ రక్షణ నిమిత్తం క్షిపణులను గాల్లోనే పేల్చే వ్యవస్థ తమకుండాలని సౌదీ భావించి, ఈ డీల్ కు మొగ్గు చూపింది.
కాగా, మొత్తం 44 లాంచర్లు, 360 థాడ్ క్షిపణులు, 16 స్ట్రాటజిక్ సిస్టమ్స్, ఖండాంతర క్షిపణులను గుర్తించేందుకు 7 అత్యాధునిక రాడార్లు, వీటన్నింటినీ నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి, 43 ట్రక్కులు, జనరేటర్లు, ట్రాలర్లు తదితరాలను అందించనుంది. కాగా, ఉత్తర కొరియా నుంచి ఏమైనా ప్రమాదం జరిగితే, సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో దక్షిణాఫ్రికాతో పాటు గువామ్ ద్వీపంలోనూ వీటిని అమెరికా అమర్చిన సంగతి తెలిసిందే.