pbl: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వేలం నేడే... ఫ్రాంచైజీల దృష్టంతా పీవీ సింధు పైనే!
- సింధు కోసం 8 ఫ్రాంచైజీల పోటీ
- కరోలినా మారిన్, తై జు యింగ్ల పైన కూడా దృష్టి
- వేలానికి అందుబాటులో 133 మంది క్రీడాకారులు
రెండు సీజన్లు పూర్తి చేసుకుని ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ మూడో సీజన్లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన క్రీడాకారుల వేలం ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన పీవీ సింధు పైనే ఫ్రాంచైజీల దృష్టంతా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కోసం రూ. లక్షలు ఖర్చు పెట్టేందుకు వేలంలో పాల్గొంటున్న ఎనిమిది ఫ్రాంచైజీలు (రెండు కొత్త ఫ్రాంచైజీలు) సిద్ధంగా ఉన్నాయి. 11 దేశాలకు చెందిన 133 మంది క్రీడాకారులు వేలానికి అందుబాటులో ఉన్నారు. ఈ వేలంలో పీవీ సింధుతో పాటు స్పెయిన్‌కి చెందిన కరోలినా మారిన్, తైవాన్‌కి చెందిన తై జు యింగ్, భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ల మీద కూడా భారీ మొత్తం ఖర్చు పెట్టేందుకు ఫ్రాంఛైజీలు వెనుకాడటం లేదు.
మొత్తం 82 మంది భారత క్రీడాకారులు ఈ వేలంలో ఉన్నారు. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం గరిష్టంగా రూ. 2.12 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. ఒక్కో క్రీడాకారుడిపై గరిష్టంగా రూ. 72 లక్షలు ఖర్చు చేయవచ్చు. డిసెంబర్ 22 నుంచి జనవరి 14 వరకు 24 రోజుల పాటు హైదరాబాద్, ముంబై, లక్నో, చెన్నై, గుహవటి ప్రాంతాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.