kuppam: పన్నెండేళ్ల తరువాత కుప్పంలో అతి భారీ వర్షం... ఫోన్ చేసి పరిస్థితి అడిగిన చంద్రబాబు
- నిండిన చెరువులు
- పొంగి పొరలుతున్న వాగులు, వంకలు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- తాను స్వయంగా కుప్పం వస్తానన్న చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పన్నెండేళ్ల తరువాత అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా, కుప్పం పురవీధులన్నీ నీటితో నిండిపోయాయి. అన్ని వంతెనలు, చప్టాలపై నీరు భారీగా ప్రవహిస్తుండగా, దాదాపు అన్ని గ్రామాల మధ్యా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పల్లపు ప్రాంతాలు జలమయం కాగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టికి చిత్తూరు జిల్లాలోని అన్ని చెరువులూ నిండిపోయాయి. కుప్పం, చిత్తూరు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, అక్కడి పరిస్థితిని వాకబు చేశారు.
భారీ వర్షాల పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన, అన్ని పంటకుంటలూ నిండాయని, వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను తక్షణమే మరమ్మతు చేయిస్తామని తెలిపారు. నీరు వృథా కాకుండా అన్ని రకాల చర్యలనూ చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 14, 15 తేదీల్లో వీలైతే కుప్పం పర్యటనకు స్వయంగా వస్తానని చెప్పారు.