mamatha kulakarni: బాలీవుడ్ నటి మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధం
- రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్ ను కోరిన సీబీఐ
- నేడో, రేపో నోటీసులు జారీ అయ్యే అవకాశం
- అండర్ గ్రౌండ్ లో మమత సహచరుడు విక్కీ గోస్వామి
బాలీవుడ్ మాజీ హీరోయిన్ మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధమైంది. సోలాపూర్ లో ఎఫిడ్రిన్ పట్టివేత కేసులో ఆమెకు నోటీసులు జారీ కానున్నాయి. తన సహచరుడు విక్కీ గోస్వామితో కలసి ఆమె పలు దేశాల్లో డ్రగ్స్ దందా నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. సోలాపూర్ లోని ఏ1 లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీలో ఎఫిడ్రిన్ తయారీ ముఠాతో వీరికి నేరుగా సంబంధాలు ఉన్నాయనేదానిపై సీఐడీ పక్కా ఆధారాలను సేకరించింది. దర్యాప్తు వివరాలను సీబీఐకి సీఐడీ సమర్పించింది. ఈ నివేదికను అంతర్జాతీయ సంస్థ ఇంటర్ పోల్ కు పంపిన సీబీఐ... మమతా కులకర్ణిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కోరింది. ఇది జరిగి రెండు నెలలు కావస్తోంది. అయితే, చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో నోటీసుల జారీ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడ్డాయి.
తాజాగా, సెప్టెంబర్ 29న ఆమెపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, నేడో రేపో మమతకు నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం మమత కెన్యాలో ఉంది. ఆమె సహచరుడు గోస్వామి అమెరికాలో అండర్ గ్రౌండ్ లో వున్నట్టు సమాచారం. గతంలో కూడా డ్రగ్స్ కేసులో మమత కెన్యాలో అరెస్టయి, విడుదలయింది. సోలాపూర్ కేసులో ఇద్దరు నైజీరియన్లు సహా 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.