petrol: దేశవ్యాప్తంగా 12వ తేదీన పెట్రోల్ బంకులు బంద్!
- 12వ తేదీ అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల సమ్మె
- దేశవ్యాప్తంగా డీలర్ల నిరసన
- పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్
హోమ్ డెలివరీ విధానంతో పాటు, పెట్రోల్ వ్యాపారులకు లాభసాటిగా లేని రోజువారీ ధరల సమీక్షా విధానానికి వ్యతిరేకంగా పెట్రోల్ బంకులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఈ నెల 12న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చామని యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్ (యూపీఎఫ్) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు పెట్రోల్ బంకులు మూతపడనున్నాయని వెల్లడించింది. తమ నిర్ణయం ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని, పెట్రోలియం డీలర్ల సమస్యల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకని యూపీఎఫ్ తెలిపింది.
అప్పటికీ కేంద్రం తమను పట్టించుకోకపోతే ఈ నెల 27 నుంచి నిరవధికంగా కొనుగోళ్లు, అమ్మకాలను నిలిపివేస్తామని యూపీఎఫ్ హెచ్చరించింది. తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరిస్తామని గత నవంబర్ లో హామీనిచ్చిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) ఆ తరువాత వాటిని పట్టించుకోవడం మానేశాయని 'ఆల్ కర్ణాటక ఫ్రంట్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్' అధ్యక్షుడు బీఆర్ రవీంద్రనాథ్ ఆరోపించారు. పెట్రోల్ డీలర్లకు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా మార్గదర్శకాల్లో సవరణ చేయడం ఏకపక్షం, అన్యాయమని ఆయన ఆరోపించారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.